- జిల్లాలో సర్కారు వడ్ల కొనుగోలు షురూ
- 466 సెంటర్స్ ఓపెన్ చేయాలని ఆర్డర్స్
- ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ వల్ల కేంద్రాల ఏర్పాటులో లేట్
- 65 శాతం సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లకు కొత్త కేటాయింపులు నో
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు షురు అయ్యాయి. బిల్లు చెల్లింపులో అక్రమాలకు తావులేకుండా గవర్నమెంట్ ఈసారి కొత్తగా ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. వడ్లు అమ్మిన రైతు ఐరిష్ రికార్డు చేసి, వాటి ఆధారంగానే బ్యాంకు ఖాతాలో పైసలు జమ చేసేందుకు ప్రభుత్వం ఈ యాప్ తెచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఓపీఎంఎస్ పూర్తి స్థాయిలో ఈ సాఫ్ట్ వేర్‌ను అధికారులు వాడటం ప్రారంభించారు.
ఈ సాఫ్ట్వేర్ లింక్‌తోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి.
6 లక్షల మెట్రక్ టన్నుల వడ్లు టార్గెట్ మొత్తం 466 సెంటర్లు తెరువాలని సివిల్ సప్లయ్ అధికారులు నిర్ణయించారు. యాసంగి సీజన్లో వరి పంట రికార్డు స్థాయిలో రైతులు సాగు చేశారు. 2.84 లక్షల ఎకరాలలో పంట వేస్తారని అంచనా వేయగా 4.16 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. దిగుబడి 11.72 లక్షల మెట్రిక్ టన్నులు కాగా అందులో 70 శాతం సన్నాలే ఉన్నాయి. పంట విస్తీర్ణం ఎక్కువ ఉన్నందున జిల్లా నుంచి వడ్ల కొనుగోలు ఎక్కువ శాతం చేయాలని గవర్నమెంట్ ఆలోచించి 6 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం పెట్టుకుంది.
ఓటీపీకి చెక్.. ఇక ఐరిష్తోనే పేమెంట్
వరి కోతలు 20 రోజుల కింద మొదలైనా ఓపీఎంఎస్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడం వల్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటు రెండు వారాలు లేట్ అయింది. కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులో అవినీతిలేకుండా చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఈ సీజన్ నుంచి వాడుతోంది. వడ్లు కాంటా పెట్టిన రైతు ఐరిష్ సేకరించి అతని బ్యాంకు ఖాతాలో నేరుగా పైసలు జమ చేయడం దీని ఉద్దేశ్యం.
గత సీజన్ దాకా ఓటీపీ నంబర్‌తో కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులు చేసేవారు. ఇది కొన్ని అక్రమాలకు దారితీసింది. రైతుల స్థానంలో సెంటర్లు నడిపిన నిర్వహకులు బిల్లులు పొందిన సందర్భాలు ఉన్నాయి. రైతు ఐరిష్ సేకరణతో అవినీతికి చెక్ పడనుంది. పక్క స్టేట్ రైతులు, వ్యాపారులు ఇక్కడి కేంద్రాలలో వడ్లు అమ్మకుండా ఓపీఎంఎస్ విధానం నియంత్రిస్తుందని అధికారులు అంటున్నారు.
స్టేట్ బార్డర్లో చెక్ పోస్టులు..
గవర్నమెంట్'ఏ' గ్రేడ్ వడ్లు క్వింటాల్‌కు రూ.2,203 'బీ'గ్రేడ్‌కు రూ.2,183 ధర చెల్లిస్తుంది. దీంతో పక్క స్టేట్ నుంచి వచ్చే వడ్లను అడ్డుకునేందుకు బార్డర్ చెక్‌పోస్టులు పెట్టారు. పోతంగల్, కందకుర్తి, సాలూరా వద్ద డే అండ్ నైట్ చెక్‌పోస్టులు పనిచేసేలా కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆర్డర్స్ జారీ చేశారు.
బ్లాక్ లిస్టులో ఉన్న మిల్స్‌కు వడ్లు బంద్
సీఎంఆర్ రైస్ 65 శాతం ఇచ్చిన మిల్లర్లకే ఈసీజన్ వడ్లు పంపేందుకు అధికారులు రెడీ అయ్యారు. బ్లాక్ లిస్టు మిల్లులకు గింజ ధాన్యం కూడా పంపొద్దని ఇదివరకే ప్రభుత్వం ఆదేశించింది. వాటిని స్థానిక అధికారులు కచ్చితంగా అమలు చేస్తామంటున్నారు. జిల్లాలో పారా బాయిల్డ్ రైస్ మిల్స్230, బాయిల్డ్ మిల్లులు 72 ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల సీఎంఆర్ రైస్ మాయం చేసిన తొమ్మిది మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. గవర్నమెంట్ వడ్లను బయట అమ్ముకున్న 13 బాయిల్డ్, 31 పారా బాయిల్డ్ రైస్ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు సీఎంఆర్ వడ్లు అసలు ఇవ్వొద్దని సర్కారు ఆదేశాలు ఉన్నాయి. ఆ లెక్కన కేసులు, బ్లాక్‌లిస్టు మిల్లులకు గింజ కూడా ఇవ్వరు. కనీసం 65 శాతం సీఎంఆర్ రైస్ ఇచ్చిన రైస్ మిల్లర్లకు మాత్రమే ఇప్పుడు కొనుగోలు చేసే వడ్లు పంపనున్నారు.