- యాసంగిలో ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు
- విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు సిద్ధమవుతున్న వ్యవసాయ అధికారులు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: సాధారణంగా యాసంగి సీజన్లో నీటి లభ్యత తక్కువగా ఉండడం, ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎక్కువ శాతం ఆరుతడి పంటలు సాగు చేస్తారు. కాగా ప్రస్తుత యాసంగి సీజన్లో మాత్రం మెదక్ జిల్లాలో మెజారిటీ రైతులు వానకాలం మాదిరిగానే వరి పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఆగస్టు, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురవడం వల్ల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్లు, చెరువులు, కుంటలు అన్నీపూర్తి స్థాయిలో నిండాయి.
బోర్లలో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఈ కారణంగా యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరుగనుంది. 2024 – 25 యాసంగి సీజన్లో జిల్లాలోని 21 మండలాల పరిధిలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 2,84,836 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 2,65,000 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా.
జొన్న 8,810 ఎకరాల్లో, మొక్కజొన్న 2,700 ఎకరాల్లో, వేరుశెనగ 130 ఎకరాల్లో, శెనగ 280 ఎకరాల్లో, సన్ ఫ్లవర్ 430 ఎకరాల్లో, ఇతర పంటలు 1,500 ఎకరాల్లో, హార్టికల్చర్ పంటలు 5,800 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఆయా పంటల సాగుకు అన్ని రకాలు కలిపి మొత్తం 48,491 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 23,565 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,680, మ్యూరేట్ఆఫ్పొటాష్,1,755, కాంప్లెక్స్20,591, సింగిల్ సూపర్ పాస్పేట్900 మెట్రిక్ టన్నులు అవసరం కానుంది.
Also Read :- భారీగా పెరిగిన పెళ్లిళ్ల ఖర్చు.. సగటున ఒక్క పెళ్లికి రూ. 51లక్షలు
సిద్దిపేట జిల్లాలో
సిద్దిపేట జిల్లాలో యాసంగి ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఈ సీజన్ లో దాదాపు 3.86 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం సాగు విస్తీర్ణంలో మూడు లక్షల వరకు వరి సాగు జరుగుతుందని భావిస్తున్నారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ డివిజన్ లలో దాదాపు 20 వేల ఎకరాల్లో శెనగ, జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న , 4 వేల ఎకరాల్లో వేరు శెనగ, 11 వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట సాగు జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇందుకోసం రైతులకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. మొక్కజొన్న 4 వేలు, పొద్దు తిరుగుడు 1100, వేరు శెనగ 600, శెనగలు 2 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని చెబుతున్నారు. శెనగ విత్తనాలకు సబ్సీడీ లేకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉండగా మిగిలినవి రైతు ఆగ్రో సెంటర్లలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగు విస్తీర్ణం గతం కంటే పెరగనుంది. గతేడాదిలో అన్ని పంటలు కలిపి 1,91,639 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 2,01,193 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో బోరు బావులు, నీటి కుంటలు, ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులు నిండుగా ఉన్నాయి. భూగర్భ జలాలు సైతం పెరగడంతో రైతులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ పంటల సాగుకు ప్లాన్ చేసింది.
యాసంగిలో వరి 1.10 లక్షల ఎకరాలు, జొన్న 59 వేలు, శెనగ 2 వేలు, మొక్కజొన్న 5,500, గోధుమ 500, తెల్ల కుసుమలు 3,100, పొద్దు తిరుగుడు 402, వేరుశెనగ 200, చెరుకు 1600 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా. కాగా జిల్లా వ్యాప్తంగా అంచనాకు మించి పంటల సాగు కావచ్చని డీఏవో శివప్రసాద్ తెలిపారు. నీటి లభ్యత ఉన్న కారణంగా వరి నూర్పులు పూర్తికాగానే ఆరుతడి పంటలకు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.