చివరి ఆయకట్టుకు సాగునీరు అందేనా..!

చివరి ఆయకట్టుకు సాగునీరు అందేనా..!
  • యాసంగి సాగుకు ఎస్సారెస్పీ జలాల విడుదల 
  • ముళ్ల పొదలతో నిండిపోయిన ఎస్సారెస్పీ స్టేజీ2 కాలువలు
  • కాలువల లైనింగ్​ చేపట్టాలని రైతుల విన్నపం 

మహబూబాబాద్​, వెలుగు: యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజీ 1,2 పరిధిలో ఆన్​అండ్​ ఆఫ్​ (వారబందీ)  పద్ధతిలో సాగు నీరు అందించాలని నిర్ణయించారు.  మహబూబాబాద్​ జిల్లాలోని ఎస్సారెస్పీ స్టేజ్​2 పరిధిలో  డీబీఎం 60 ప్రధాన కెనాల్, ఉప కాలువలు​ లైనింగ్​చేయకపోవడంతో  కంప చెట్లు కాలువ నిండా పెరిగాయి.  తొర్రూరు మండలం పటేల్​గూడెం నుంచి దంతాలపల్లి మండలం ద్వారా మరిపెడ మండలం ప్రధాన కాలువగా కొనసాగుతుంది.  కాలువల లైనింగ్​ చేపట్టి ఆధునికీకరించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

5.77 లక్షల ఎకరాలకు నీటి విడుదల 

ప్రాజెక్టుల కింద యాసంగి పంట కాలానికి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. యాసంగిలో పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వొచ్చని ఆఫీసర్లు భావిస్తున్నారు.  ప్రాజెక్టుల్లో నీటి లభ్యతకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌లో సుమారుగా 5. 77 లక్షల ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన యాసంగికి సాగునీరు సరఫరా చేయొచ్చని అంచనా వేశారు.

2025 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు వారం రోజులు నీటి విడుదల చేస్తే మరోవారం రోజులు  నీటి సరఫరా నిలిపివేస్తారు.  ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనల ప్రకారం ఎస్సారెస్పీ స్టేజ్1(ఎల్ఎండీ) కింద 2,21,947 ఎకరాలు, 

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 93,070 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీ-2 కింద 90,611 ఎకరాలు,  దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 1,71,528 ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు సరఫరా  చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

యాసంగిలో రైతులకు సాగు నీరు అందించడం కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ జలాలను జనవరి1 నుంచి  విడుదల చేశాం. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఎస్సారెస్పీ కాలువలలో అడ్డుకట్ట వేయడం, అక్రమంగా మోటార్లను బిగించడం, కిందికి నీరు వెళ్లకుండా అడ్డుకోవద్దు.  కాలువలు దెబ్బతిన్న చోట ఆధునికీకరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తాం.  సమ్మిరెడ్డి, ఇరిగేషన్​, ఈఈ,   మహబూబాబాద్​