Yash Dhull: హార్ట్ సర్జరీ విజయవంతం.. అప్పుడే బ్యాట్ పట్టిన భారత అండర్ 19 కెప్టెన్

Yash Dhull: హార్ట్ సర్జరీ విజయవంతం.. అప్పుడే బ్యాట్ పట్టిన భారత అండర్ 19 కెప్టెన్

భారత అండర్ 19 కెప్టెన్ యష్ ధుల్ తన జీవితంలో పోరాడి గెలిచాడు. క్రికెట్ పై తనకున్న అంకిత భావానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంప్‌లో స్కాన్‌ చేసినప్పుడు ధుల్ గుండెలో చిన్న రంధ్రం ఉన్నట్టు గుర్తించబడింది. ఈ విషయన్ని అతని బ్యాటింగ్ కోచ్ రాజేష్ నగర్ వెల్లడించాడు. దీంతో ధుల్ గుండెకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అతని సర్జరీ విజయవంతమైందని తాజాగా అతని కోచ్ చెప్పుకొచ్చాడు.  

“ధుల్ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతను కోలుకోవడానికి దాదాపు 10 నుండి 15 రోజులు పట్టింది. అతని ఆట, ఫిట్‌నెస్ పరంగా ను ప్రస్తుతం 100 శాతం కోలుకోలేదు. 80 శాతం మాత్రమే అతను కోలుకున్నాడని నేను చెప్పగలను. ఇది ఒక చిన్న రంధ్రం. అతనికి పుట్టినప్పటి నుంచే ఉంది. కానీ ఇప్పుడు ఇప్పుడు కనుగొనబడింది. అతను త్వరలో ఉత్తమ స్థితికి వస్తాడు". అని నగర్ బుధవారం (ఆగస్టు 29) అన్నాడు.

పూర్తి ఫిట్ నెస్ సాధించకపోయినా యష్ ధుల్ అప్పుడే బ్యాట్ పట్టడంతో క్రికెట్ మీద అతనికి ఎంత అంకిత భావం ఉందనే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో అతను 113.41 స్ట్రైక్ రేట్‌తో 93 పరుగులు చేశాడు. వీటిలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 2022 భారత అండర్ 19 వరల్డ్ కప్ కు ధుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. టీమిండియా తరపున భవిష్యత్ స్టార్ గా అతను దిగ్గజ క్రికెటర్ల నుండి కితాబులందుకుంటున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేశాడు.