YESH : గ్లోబల్ ఆడియెన్స్ కోసం.. కేజీయఫ్ స్టార్ యష్ సంచలన అడుగు

YESH : గ్లోబల్ ఆడియెన్స్ కోసం.. కేజీయఫ్ స్టార్ యష్ సంచలన అడుగు

కేజీయఫ్’ చిత్రంతో పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా మెప్పించిన కన్నడ స్టార్ యష్... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా తను హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాను ఇంగ్లీష్‌‌‌‌లోనూ రూపొందిస్తున్నట్టు ప్రకటించారు.   కన్నడ, ఇంగ్లీష్‌‌‌‌  భాషల్లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి చిత్రంగా ‘టాక్సిక్’  రికార్డుల్లోకి ఎక్కింది. గ్లోబల్ ఆడియెన్స్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని  కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో షూట్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.  

అలాగే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్ చేయనున్నారు. విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతున్న ఈ చిత్రం  అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని దర్శకుడు గీతూ మోహన్ దాస్ అన్నారు.  ఈ కథపై తమకెంతో  నమ్మకం ఉందని,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రతిభను కూడా ప్రదర్శించేలా ఈ చిత్రం రాబోతోందని నిర్మాత వెంకట్ నారాయణ అన్నారు.