భారత యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచుకు స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ముందుగా రిజర్వు ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని ఎంపిక చేసినప్పటికీ.. పెళ్లి కారణంగా అతడు ఈ మ్యాచుకు దూరం కానున్నాడు. దీంతో జైశ్వాల్ కి అవకాశం దక్కింది. ఆదివారం రాత్రికే జైశ్వాల్ లండన్ బయలుదేరి వెళ్లనున్నాడని సమాచారం.
ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి రెండ్రోజుల ముందుగా అంటే జూన్ 5లోపు ఆటగాళ్లు జట్టుతో కలవాల్సి ఉంటుంది. అయితే జూన్ 3-4 తేదీల్లో గైక్వాడ్ వివాహం జరగనుండడంతో.. జూన్ ఐదో తేదీలోగా అతడు లండన్ చేరుకోలేడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ విషయం తెలుసుకున్న జైశ్వాల్ ఇప్పటికే రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆదివారం జింఖానా వేదికగా రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ జుబిన్ బరూచాతో కలిసి అతడు రెడ్ బాల్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఐపీఎల్ 2023లో యశస్వి జైశ్వాల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచుల్లో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా, ఐదు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచులు ఆడిన జైస్వాల్ 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.