విశాఖపట్నం: టీమిండియా యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్(257 బాల్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 179 బ్యాటింగ్) వైజాగ్‌లో తన విశ్వరూపం చూపెట్టాడు. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న యశస్వి ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తొలి రోజే తడబడుతున్న ఇండియాను ఆదుకున్నాడు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ (14) సహా స్టార్లు, సీనియర్ ప్లేయర్లంతా పెవిలియన్ బాట పడుతున్న వేళ 22 ఏండ్ల కుర్రాడు పట్టుదలగా క్రీజులో నిలిచాడు. ఇంగ్లండ్ పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సెంచరీతో రెచ్చిపోయాడు. సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌కు మంచి స్కోరు అందించాడు. జైస్వాల్ మాస్టర్ క్లాస్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మొదటి రోజు చివరకు 336/6 స్కోరు చేసింది. యశస్వికి తోడు అశ్విన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో ఇండియా బ్యాటర్ రజత్ పటీదార్, ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్ అరంగేట్రం చేశారు.
రోహిత్ ఫెయిల్
తొలి టెస్టులో టాస్ ఓడటం ఇండియాను దెబ్బ తీయగా.. ఈ పోరులో టాస్ నెగ్గిన కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తనకు అచ్చొచ్చిన స్టేడియంలో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన హిట్‌మ్యాన్ మరోసారి నిరాశ పరిచాడు. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన రోహిత్ తొలి వికెట్‌కు జైస్వాల్‌తో 40 రన్స్ జోడించాడు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ అండర్సన్ స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ అతడిని ఇబ్బంది పెట్టాడు. ఒక్క బౌండ్రీ కూడా కొట్టని కెప్టెన్ చివరకు 18వ ఓవర్లో ఇంగ్లండ్ అరంగేట్రం స్పిన్నర్ బషీర్ వేసిన టర్నింగ్ బాల్‌ను నేరుగా ఆడే ప్రయత్నం చేసి లెగ్ స్లిప్‌లో ఒలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకున్న జైస్వాల్ మాత్రం క్రమంగా జోరు పెంచాడు. కట్ షాట్స్‌తో వరుసగా బౌండ్రీలు రాబట్టాడు. బషీర్ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను సిక్స్‌గా మలచిన అతను పాయింట్ దిశగా ఇంకో ఫోర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (34) ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. ఐదు ఫోర్లు కొట్టి క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన అతను అండర్సన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు 49 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
యశస్వి జోరు
103/2తో లంచ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత యశస్వి అదే జోరు కొనసాగించాడు. మంచి స్ట్రోక్‌ప్లేతో మరింత స్పీడ్‌గా బ్యాటింగ్ చేశాడు. అతనికి మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (27) నుంచి కాసేపు సపోర్ట్ లభించింది. దాంతో యశస్వి గ్రౌండ్, ఏరియల్ షాట్లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. నిర్భయంగా ఆడిన అతను లెఫ్టార్మ్ స్పిన్నర్ హార్ట్‌లీ బౌలింగ్‌లో క్రీజు దాటొచ్చి లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీకి 89 బాల్స్ తీసుకున్న అతను మరో 62 బాల్స్‌లోనే వంద మార్కు దాటాడు. తొలి సెషన్‌లో ఎక్కువగా కట్ షాట్స్ ఆడిన యంగ్ స్టర్ రెండో సెషన్‌లో డ్రైవ్స్, లాఫ్టెడ్ డ్రైవ్స్‌తో స్పిన్నర్లను ఎటాక్ చేశాడు. ముఖ్యంగా తొలి టెస్టులో ఇండియా హార్ట్ బ్రేక్ చేసిన హార్ట్‌లీని టార్గెట్ చేశాడు. అతను వేసిన 45వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించాడు.
రూట్ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్ సిక్సర్ అతని ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక అండర్సన్ షార్ట్ బాల్ సవాల్‌ను బాగానే తిప్పికొట్టిన శ్రేయస్.. హార్ట్‌లీ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌కు 90 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు రజత్ పటీదార్ (32) యశస్వికి తోడవ్వగా ఇండియా 225/3తో టీకి వెళ్లింది. రెండో సెషన్‌లో ఇండియా ఒకే వికెట్ కోల్పోయి 122 రన్స్ రాబట్టింది. మూడో సెషన్‌లోనూ యశస్వి హవానే నడవగా.. ఇంగ్లండ్ స్పిన్నర్లు పుంజుకున్నారు. బ్రేక్ నుంచి వచ్చిన కాసేపటికే రజత్.. రెహాన్ బాల్‌ను ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బౌల్డ్ అయ్యాడు. చివరి సెషన్‌లో బంతి తక్కువ బౌన్స్ అవడంతో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అక్షర్ (27), లోకల్ స్టార్ కేఎస్ భరత్ (17) వెంటవెంటనే ఔటైనా అశ్విన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా యశస్వి రోజును ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు : ఇండియా తొలి ఇన్నింగ్స్: 93 ఓవర్లలో 336/6 (యశస్వి 179 బ్యాటింగ్, గిల్ 34, రెహాన్ 2/61, బషీర్ 2/100)