యాసిన్ మాలిక్ విచారణకు జైలులోనే కోర్టు!

యాసిన్ మాలిక్ విచారణకు జైలులోనే కోర్టు!

న్యూఢిల్లీ: మన దేశంలో 26/11 టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌‌ కేసు విచారణ కూడా పారదర్శంకంగా, న్యాయబద్ధంగానే జరిగిందని సీబీఐకి సుప్రీంకోర్టు గుర్తుచేసింది. మరి వేర్పాటువాది యాసిన్ మాలిక్‌‌ కేసు విచారణ ఎందుకు పారదర్శకంగా జరపడంలేదని నిలదీసింది. నిందితుడిని వ్యక్తిగతంగా కోర్టుకు తీసుకెళ్లకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా నిర్వహించాలని అధికారులను ప్రశ్నించింది. 

1989లో రుబయా సయీద్ (అప్పటి జమ్మూకాశ్మీర్ హోంమంత్రి ముస్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె) కిడ్నాప్ కేసు, 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, టెర్రరిస్టులకు నిధులు సమకూర్చిన కేసు, టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (నివారణ) యాక్ట్ కేసుల్లో  వేర్పాటువాది యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విచారణకు మాలిక్ వ్యక్తిగతంగా హాజరుకావాలని జమ్మూ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

భద్రత కారణాల దృష్ట్యా  తీసుకెళ్లలేకపోతున్నం

సీబీఐ పిటిషన్ ను జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్‌‌లతో కూడిన బెంచ్ గురువారం విచారించింది.  సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.."భద్రతా కారణాల దృష్ట్యా మాలిక్ ను జమ్మూకు తీసుకెళ్లలేం. సాక్ష్యుల భద్రత కూడా మాకు ముఖ్యమే. గతంలో ఓ సాక్షిని హత్య చేశారు. లాయర్ ను  పెట్టుకోకుండా మాలిక్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడు. అతడు సాధారణ క్రిమినల్ కాదు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తో అతడికి సంబంధాలున్నాయి. 

గతంలో చాలాసార్లు సయీద్ ను కలిసేందుకు పాక్ కు వెళ్లాడు. ఇలాంటి కేసుల్లో మేం కేవలం పుస్తకాల్లో ఉన్నట్లు చేయలేం. మాలిక్ తప్పకుండా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి వస్తే విచారణను ఢిల్లీకి మార్చలని కోరుతున్నాం" అని కోర్టుకు విన్నవించారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. " కోర్టుకు తీసుకెళ్లకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలం? జమ్మూలో ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగానే ఉంది. మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కు కూడా పారదర్శక విచారణ ఎదుర్కొనేలా అవకాశం కల్పించాం" అని వ్యాఖ్యానించింది. 

మాలిక్‌‌ కేసు విచారణ కోసం జైలులో కోర్టును ఏర్పాటు చేయవచ్చని ధర్మాసనం అంగీకరించింది. విచారణకు ఎంతమంది సాక్షులు హాజరవుతారు, వారి భద్రతా ఏర్పాట్లను తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. యాసిన్ మాలిక్ ప్రస్తుతం తీహార్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు.