
వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని, ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. సోమవారం (ఫిబ్రవరి 24) ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. “వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. నేను ఇంకా 30ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాడతాం. 2028లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఆ ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలి” అని అన్నారు.
అసెంబ్లీకి వెళ్లకూడదని, ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత మొదటగా పులివెందుల పర్యటన చేపట్టనున్నారు. ఫిబ్రవరి 25, 26 తేదీలలో పులివెందులలో పర్యటిస్తారు. మంగళవారం (ఫిబ్రవరి 25) ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటారు.
బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైయస్‌ఆర్ ఫౌండేషన్, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించినవైయస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.