Chandragiri: బెంగళూరులో వైసీపీ యువ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్..

బెంగళూరు: వైసీపీ మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మే 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పులివర్తి నానిపై దాడి జరిగింది. 

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లి వస్తుంగా ఆయనపై వైసీపీ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పులివర్తి నాని గన్మెన్కు గాయాలయ్యాయి. ఈ దాడి వ్యవహారంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహిత్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నించగా విచారణ వాయిదా పడింది. తిరుపతి పోలీసులు ప్రస్తుతం మోహిత్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసి తిరుపతికి తరలిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉండటం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులైన గణపతి రెడ్డి, భానుకుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో నిందితులను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు.