ఏపీలో ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ వాతావరణం నెలకొంది. జగన్ దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన ఒకవైపు, సంక్షేమమే తమను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఒంటరిగా పోటీ చేస్తున్న అధికార వైసీపీ మరొకవైపు ఈసారి ఎలా అయినా గెలవాలన్న కసితో ఉన్నాయి. ఈ ఎన్నికలను ఈసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ లపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాలకృష్ణపై, జగన్ కు వ్యతిరేకంగా రూపొందించిన పాటను తన యూట్యూబ్ ఛానల్ లో టెలికాస్ట్ చేసినందుకు లోకేష్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రావెల కిషోర్ బాబు, ఇతర వైసీపీ నాయకులు. బాలకృష్ణ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోదించటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. జగన్ కు వ్యతిరేకంగా రూపొందించిన పాటను లోకేష్ యూట్యూబ్ ఛానల్ నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని తెలిపారు.