కాంట్రాక్టర్ల కోసమే సర్కారు నడిపారు : టీడీపీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు

కాంట్రాక్టర్ల కోసమే సర్కారు నడిపారు : టీడీపీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు

అమరావతి, వెలుగు: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్ధం జరిగింది. రెండ్రోజుల సెలవుల తర్వాత సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చలో అధికార పార్టీ నేతలు టీడీపీపై ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఒక్కసారిగా అసెంబ్లీలో దుమారం రేగింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అచ్చెన్నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. కాంట్రాక్టర్ల కోసమే టీడీపీ సర్కారును నడిపిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రభుత్వ విప్‌‌ ముత్యాలనాయుడు బలపరిచారు. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సీఎం అయిన 2 నెలల్లో కరెంటు సమస్యను పరిష్కరించారని,  ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ లేక పవర్ కట్స్ ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి బుగ్గన 2014లో ఇంధన, బొగ్గు ధరలు తగ్గడం వల్ల అదనపు ఉత్పత్తి సాధ్యమైందని, చంద్రబాబు ఘనత ఏమీ లేదన్నారు. టీడీపీ సర్కారు డిస్కంలకు  రూ.10 ఈవేల కోట్లు బకాయి పడిందని గుర్తు చేశారు. పట్టిసీమలో రూ. 400 కోట్లు అవినీతి జరిగినట్లు కాగ్‌‌ నివేదికలో వెల్లడైందన్నారు.  రూ. 16వేల కోట్ల పోలవరం  ప్రాజెక్టు అంచనాలను 4 ఏళ్లలో రూ. 56వేల కోట్లకు పెంచిందన్నారు. టీడీపీది బ్రహ్మాండమైన పాలన కాబట్టే తమకు 151 సీట్లు వచ్చాయని ఎగతాళి చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక సార్లు యూటర్న్‌‌ తీసుకున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విమర్శించారు. అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇంకా మారలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నేను పప్పును కాదు: అనిల్ కుమార్

మంగళగిరి అని పలకడం రాక మందలగిరి అని పలికే పప్పు తాను కాదని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి లోకేశ్ ను పరోక్షంగా విమర్శించారు. పోలవరం గురించి అనిల్ కుమార్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ కుమార్ చంద్రబాబుకు ఇరిగేష‌‌న్ పాఠాలు చెబుతున్నార‌‌ంటూ విమ‌‌ర్శించారు. దీనికి బ‌‌దులిచ్చిన అనిల్ కుమార్ త‌‌న‌‌కు తెలియ‌‌కుంటే నేర్చుకుంటానన్నారు. టీడీపీ హయాంలో  ఎన్నిక‌‌ల్లో గెల‌‌వలేని వ్యక్తిని మంత్రిని చేశారంటూ ధ్వజ‌‌మెత్తారు. ఐదేళ్లలో బోట్టు నీరు, చెట్టు నీడ లేకుండానే రూ. 18 వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలు దోచేశారని ఆరోపిచారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని టీడీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. 45 రోజుల్లో జ్యుడీషియల్ కమిటీ వస్తుందని, అన్ని లోసుగులు బయటపడతాయని హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ తొలిసారి శాసన మండలి సమావేశాల్లో పాల్గొన్నారు.