- క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఎదురుదెబ్బ తగిలింది. గచ్చిబౌలి పీఎస్‌లో ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూఖ్ బాషా చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఎంపీ, ఆయన కొడుకు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. విచారణ కూడా జరగకుండా ప్రాథమిక దశలోనే కొట్టేయలేమని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రైల్లో వెళ్తుంటే పోలీసులు వెంబడిస్తున్నారనే అనుమానం వచ్చిందని పిటిషనర్ తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు.
వెంబడించిన వ్యక్తిని గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, ఫరూఖ్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారన్నారు. దీన్ని కొట్టేయాలని విన్నవించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్లీడర్ శ్రీకాంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఎంపీ సమక్షంలోనే ఫరూఖ్‌ను ఆయన కొడుకు భరత్ కొట్టాడని కోర్టుకు విన్నవించారు. ఫరూఖ్ ఫిర్యాదుపై విచారించాల్సిందే అని కోరారు. ఏపీ గవర్నమెంట్ ప్లీడర్ పి.గోవింద్‌రెడ్డి వాదిస్తూ.. రఘురామకృష్ణ రాజు, ఆయన కుమారుడు, వ్యక్తిగత భద్రతా అధికారి, సీఆర్పీఎఫ్ స్టాఫ్ కూడా ఫరూఖ్‌ను చితకబాదారని వివరించారు. వాదనల తర్వాత కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.