వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే.. 

2024  సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడి పీక్స్ కి చేరింది. అయితే, ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవీ కూడా మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా వైసీపీ మేనియాఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం అందుతోంది. ఈ నెల 26న మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

ఈసారి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యమయే అంశాలే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు పలు జనాకర్షక పథకాలు మేనిఫెస్టోలో ఉంటాయని సమాచారం. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలే టార్గెట్ గా మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది.ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కీలక పాత్ర పోషించనుంది. 2014 ఎన్నికల్లో రుణమాఫీ సాధ్యం కాదని అన్న జగన్ అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి  అమలు చేయని అంశాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తు చేస్తూ వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, పెన్షన్ల పెంపు వంటి హామీలు కీలకం కానున్నాయని తెలుస్తోంది.