ఆర్టీసీ బస్సులో వైసీపీ వినూత్న నిరసన

ఆర్టీసీ బస్సులో వైసీపీ వినూత్న నిరసన

తిరుపతి: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేయాలంటూ ప్రతిపక్ష వైసీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. వైసీపీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన వైసీపీ మహిళలు.. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన వీడియోను బస్సులో ప్రదర్శించారు. అలాగే కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరగా.. బస్‎లో టికెట్ అడిగితే నా పేరు చెప్పండన్న చంద్రబాబు వీడియోను మేయర్ డాక్టర్ శిరీష చూపించారు. 

దీంతో ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ కండక్టర్ తేల్చి చెప్పారు. అనంతరం కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీ యునివర్సిటీ పోలీస్ స్టేషన్‎కు తరలించారు. ఆందోళన చేస్తోన్న వైసీపీ తిరుపతిఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్ట ఉపాధ్యక్షురాలు గీత యాదవ్, మహిళా విభాగం నాయకురాలిని అదుపులోకి తీసుకున్నారు.