టాక్ ఆఫ్ ది ఇయర్ : ఫాంహౌస్ నుంచి కదలని కేసీఆర్.. రాజ్యాంగానికి మొక్కిన మోడీ..

టాక్ ఆఫ్ ది ఇయర్ : ఫాంహౌస్ నుంచి కదలని కేసీఆర్.. రాజ్యాంగానికి మొక్కిన మోడీ..

ఈ ఏడాది బీఆర్ఎస్ ను కష్టాల పాలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు మార్పు మొదలైంది. భారత రాజ్యాంగం పూజలందుకుంది. మోదీ 3.0 మొదలైంది. మూసీ పంచాదితో నది ఒడ్డున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కునుకు తీశారు. ఓటమి బాధ కేసీఆర్ ను ఫాంహౌస్ కు పరిమితం చేసింది. బండి సంజయ్ కరీంనగర్ నుంచే తన వాయిస్ వినిపించారు.

రాజ్యాంగానికి మొక్కిండ్రు:

బీజేపీ ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని తేవాలని చూస్తోందని, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ చేసిన ప్రచారం మోదీని ఇరకాటంలో పడేసింది. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగాన్ని చేబూని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని చెప్పేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు నమ్మలేదు. ఫలితంగా లోక్ సభలో బొటాబొటి మెజార్టీతో విజయం సాధించింది. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ సమావేశంలోనే రాజ్యాంగానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు. రాజ్యాంగానికి మొక్కి.. స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చారు.

గాలిమోటర్ల రేవంత్ చక్కర్లు:

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలను విస్తృతం చేశారు. హెలికాప్టర్ లో వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించారు. దీంతో పాటు అమెరికా, దక్షిణ కొరియా, బ్రిటన్ లో పర్యటించి పెట్టుబడులను తెచ్చారు. అదే సమయంలో తరుచూ ఢిల్లీకి వెళ్లడం.. హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం నుంచి పిలుపు రాగానే ఢిల్లీ బయల్దేరి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఆయన వెళ్లిన ప్రతి సారీ కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చించారని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది.

ఫాంహౌస్ నుంచి బైటికెళ్లని కేసీఆర్:

పదేండ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఫాంహౌస్ కు పరిమితమయ్యారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కుంగిపోయిన ఆయన ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. తర్వాత కాలు జారిపడటంతో ఫ్రాక్చర్ అయ్యింది. సర్జరీల తర్వాత ఈ ఏడాది జూలై 15న అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే నెలలో 25వ తేదీన బడ్జెట్ సమావేశానికి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆయన అసెంబ్లీకి రాకపోవడం వివాదాస్పదంగా మారింది. 1 అధికార పక్షం సవాలు విసురుతున్నా సారు బయటికి రాకపోవడం టాక్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

మూసీ ఒడ్డున పండుకున్న కిషన్ రెడ్డి:

మూసీ పునరుజ్జీవం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కలిసొచ్చింది. మూసీ పునరుజ్జీవాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఆయన ఒక రోజు మూసీ నిద్ర నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు మురుగుతో సహవాసం చేస్తున్నారని, రోగాల పాలవుతున్నారని, దమ్ముంటే ఒక రోజు మూసీ నదీ తీరంలో నివసించాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించిన కేంద్ర మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మూసీ ఒడ్డున ఉన్న దాదాపు 18 ప్రాంతాల్లోని పేదల ఇండ్లలో కాషాయ లీడర్లు నిద్రించారు.

కరీంనగర్ నుంచే లొల్లి జేస్తున్న బండి:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హల్ చల్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అడ్డాను కరీంనగర్ కు మార్చారు. అక్కడి నుంచి కీలక పోరాటాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ కు పెద్దగా రావడం లేదు. కీలకమైన సవాళ్లు, ప్రతి సవాళ్లకు కేరాఫ్ గా కరీంనగర్ నే మార్చేశారాయన. పనిలో పనిగా తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. కరీంనగర్ కేంద్రంగా జరిగిన దీక్షలు, ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు కేటీఆర్, కేసీఆర్ పై విరుచుకు పడుతూ తనదైన శైలిని కొనసాగించారు.

ALSO READ | న్యూస్ రీల్ 2024