సెంచూరియన్: కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియా తరఫున టీ20ల్లో బరిలోకి దిగి ఏడాది అవుతోంది. గత టీ20 వరల్డ్ కప్ అనంతరం ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఆడి కప్పు అందుకోవాలని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇండియా తరఫున తన టీ20 భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు తగిన సమయంలో సమాధానం లభిస్తుందని సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ చెప్పాడు.
నేషనల్ టీమ్ తరఫున లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రతీ క్రికెటర్ కోరుకుంటాడని తెలిపాడు. ఇక, సౌతాఫ్రికా గడ్డపై గత 31 ఏండ్లుగా ఇండియాకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హిట్‌మ్యాన్ చెప్పాడు.1992 నుంచి ఎనిమిది పర్యాయాల్లో సఫారీ గడ్డపై అందని సిరీస్‌ను ఈసారి తన కెప్టెన్సీలోని జట్టు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
ఒక టీమ్‌గా ఈ రెండు మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యమైనవి. ఇదివరకు మేం ఇక్కడ సిరీస్‌ను గెలవలేదు. కాబట్టి ఇప్పుడు మా ముందు గొప్ప అవకాశం ఉంది. చివరి రెండు టూర్లలో సిరీస్‌కు చాలా దగ్గరగా రావడం ఈసారి మాలో ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో ఏ ఇండియన్ టీమ్ అందుకోని ఘనతను సొంతం చేసుకోవడానికి మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి వచ్చాం. ఒకవేళ మేం సిరీస్ గెలిస్తే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి గాయం మానుతుందో లేదో నాకు తెలియదు. ఏదేమైనా మేం చాలా కష్టపడుతున్నాం. ఓ మంచి ఫలితం సాధించాల్సిన సమయం ఇది’ అని చెప్పుకొచ్చాడు.