ఏచూరికి కన్నీటి వీడ్కోలు.. జన సందోహం నడుమ ముగిసిన అంతిమయాత్ర

న్యూఢిల్లీ, వెలుగు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర శనివారం ముగిసింది. ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని  సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‎కు తరలించారు. అక్కడ  పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృందా కారత్, పినరయి విజయన్, ఎంఏ బేబీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర పార్టీల నేతలు తదితరులు నివాళులర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ కూడా పార్టీ నేతలతో కలిసి వచ్చి ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. 

 తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, బీహార్‌‌‌‌‌‌‌‌, యూపీ నుంచి సీపీఎం నేతలు ఏచూరి కడసారి చూపుకోసం తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏకేజీ భవన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడికి చేరుకున్నాక ఏచూరి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. కాగా,  ఏచూరికి వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, కమ్యూనిస్ట్​ నేతలు బీవీ రాఘ‌‌వులు, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారావు, ఎంఆర్‌‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ  కూడా నివాళులు అర్పించారు.