![యడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురు పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ](https://static.v6velugu.com/uploads/2025/02/yeddyurappa-will-be-beaten-in-the-high-court-refusal-to-dismiss-pocso-case_r0cwxQYTHv.jpg)
బెంగళూరు: మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో అతనిపై పోక్సో కేసును కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. ఆ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపింది. అయితే, ముందస్తు బెయిల్ మంజూరు చేసి.. పాక్షిక ఉపశమనం కల్పించింది.
ఓ మహిళ తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి బెంగళూరులోని డాలర్స్ కాలనీలో గల యడియూరప్ప ఇంటికి వెళ్లగా.. ఆయన తన కూతురును లైంగికంగా వేధించాడని ఆ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు మార్చి 14, 2024న పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు వాపస్ తీసుకునేందుకు తనకు యడియూరప్ప డబ్బు ఆశ చూపారని బాలిక తల్లి ఆరోపించింది.
అయితే, యడియూరప్ప తరఫు అడ్వొకేట్ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు. గతంలో మరొక వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ కేసులో సహాయం కోసం వారిద్దరు యడియూరప్పను సంప్రదించారని కోర్టుకు తెలిపారు. అయితే, ప్రాసిక్యూషన్ ఈ వాదనలను తిప్పికొట్టింది. యడియూరప్ప బాలికను లైంగికంగా వేధించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. మైనర్‌పై లైంగిక వేధింపులు హేయమైన చర్య అని వాదించింది. శుక్రవారం ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ఎం. నాగప్రసన్న తీర్పును ప్రకటించారు.