చివరకు, సాధించిండు!

కుమారస్వామి ప్రభుత్వం పై 14 నెలలుగా అలుపెరుగని పోరాటం చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప చివరకు విజయం సాధించారు. కాంగ్రెస్ – జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన వెంటనే విక్టరీ సంకేతం చూపించారు. ఏడాదికి పైగా తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న ఫీలింగ్ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది.

‘అపవిత్ర కలయిక’ అనే అభిప్రాయం

హెచ్ డీ కుమారస్వామి నాయకత్వంలోని ప్రభుత్వం పై యడ్యూరప్ప మొదట్నుంచీ చేస్తున్న విమర్శ ఒకటే “అది అపవిత్ర కలయిక”అని,  యడ్యూరప్ప ఈ కామెంట్ చాలా సార్లు చేశారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్, జేడీ (ఎస్) మధ్య ఎలాంటి పొత్తు లేదు. మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీ (ఎస్) విడివిడిగా పోటీ చేశాయి. 224 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 104 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 113 సాధించడంలో బీజేపీ ఫెయిలైంది. కాంగ్రెస్ కేవలం 80 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. జేడీ (ఎస్) కు 37 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ ఏ ఒక్క పార్టీకి రాకపోవడంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వందకు పైగా సీట్లు సాధించిన బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ చకచకా పావులు కదిపింది. కేవలం 37 సీట్లు గెలుచుకున్న జేడీ (ఎస్) కు కాంగ్రెస్ మద్దతు పలికింది. జేడీ (ఎస్) లీడర్ కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెట్టింది. అలా మొదలైంది కుమారస్వామి సర్కార్ జర్నీ. కాంగ్రెస్ చేసిన పనిని అప్పట్నుంచీ యడ్యూరప్ప తప్పు పడుతూనే ఉన్నారు. రాజకీయంగా ఎడమొహం, పెడమొహంగా ఉండే కాంగ్రెస్, జేడీ (ఎస్) కేవలం అధికారం కోసమే కలిశాయని విమర్శలు చేశారు. ఈ అపవిత్ర కలయిక వల్ల అసెంబ్లీలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ అధికారంలోకి రాకుండా పోయిందని విమర్శించారు. నంబర్ గేమ్ లో కాంగ్రెస్ –జేడీ (ఎస్ ) కూటమి గెలిచినా,  ప్రజల దృష్టిలో  నైతికంగా ఓడిపోయాయన్నది యడ్యూరప్ప ఆరోపణ. ఈ ‘ అపవిత్ర కలయిక ’ పై తాము పోరాటం చేస్తామని ఆయన ఓపెన్ గానే అనేవారు.

కుమారస్వామితో పాత గొడవలు

కుమారస్వామితో  యడ్యూరప్పకు పడకపోవడమనేది ఈనాటిది కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. 2006 లో ధరమ్ సింగ్ నాయకత్వంలోని కూటమి సర్కార్ ను కూల్చడంలో కుమారస్వామికి యడ్యూరప్ప సాయం అందించారు. ఈ పరిస్థితుల్లో  జేడీ (ఎస్), బీజేపీ మధ్య  ఒక ఒప్పందం కుదిరింది. ఈ డీల్  ప్రకారం మొదటి 20 నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత యడ్యూరప్ప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారు. అగ్రిమెంట్  మేరకు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. యడ్యూరప్పకు  డిప్యూటీ సీఎం  పదవి లభించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఫైనాన్స్ మినిస్ట్రీ ని చూశారు. 20 నెలల తర్వాత2007 నవంబర్ 12న యడ్యూరప్ప  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే  కుమారస్వామి మనసు మార్చుకుని మద్దతు విత్ డ్రా చేసుకోవడంతో  అదే ఏడాది నవంబర్ 19 న యడ్యూరప్ప సర్కార్ పడిపోయింది. ఇలా సౌతిండియాలో ఏర్పడ్డ తొలి బీజేపీ సర్కార్ సరిగా వారం రోజులకే పడిపోయింది. ఒప్పందాన్ని బేఖాతర్ చేసి జేడీ (ఎస్) తనను వెన్నుపోటు పొడిచిందన్నది యడ్యూరప్ప ఆరోపణ. ఇదొక్కటే కాదు. కుమారస్వామి పై పగ పెంచుకోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి.

జైలుకు పంపాడన్న కోపం

2011 లో  అక్రమ గనుల తవ్వకాల ఇష్యూపై  యడ్యూరప్పను లోకాయుక్త తప్పు పట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో లోకాయుక్త కోర్టుకు ఆయన లొంగిపోవడం, వారం రోజుల పాటు జైలు కెళ్లడం చకాచకా జరిగిపోయాయి.ఈ ఎపిసోడ్ తో ప్రజల్లో యడ్యూరప్ప ఇమేజ్  కొంతవరకు తగ్గిపోయింది. వీటన్నిటి వెనుక కుమారస్వామి ఉన్నారన్నది యడ్యూరప్ప అనుమానం. ఆ అనుమానం పగగా మారిపోయిందని,  ఎలాగైనా కుమారస్వామిని సీఎం కుర్చీనుంచి దించేయాలని యడ్యూరప్ప గట్టిగా డిసైడ్ కావడానికి ఇది కూడా ఒక కారణమని ఎనలిస్టులు అంటారు.

సౌత్ లో తొలి బీజేపీ సర్కార్ యడ్యూరప్పదే

సౌత్ లో  బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఏర్పాటైంది కర్ణాటకలోనే. 2008 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లు గెలుచుకుంది. యడ్యూరప్ప నాయకత్వంలో దక్షిణాన తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమైంది.

సౌత్ లోపాగా వేయడానికి వ్యూహం

మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి ఉన్న నార్త్ ఇండియా పార్టీ అనే ముద్రను చెరిపేయడానికి  హై కమాండ్ తాపత్రయపడుతోంది. సౌత్ లోనూ పాగా వేయడానికి  ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలుంటే ఒక్క  దక్షిణాదిలోనే 129 సీట్లున్నాయి. ఇప్పటివరకు కర్ణాటకలో  మినహా మరెక్కడా బీజేపీ బలంగా లేదు. కిందటేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దగ్గరగా వచ్చినట్లే వచ్చి  కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. దీంతో సౌత్ లో పాగా వేయడానికి పక్కా ప్లాన్ తో ముందుకెళుతోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఒక దశలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. రాహుల్ గాంధీ కేరళ లోని వయనాడ్ నుంచి లోక్ సభ కు ఎన్నికకావడంతో  దీనికి కౌంటర్ గా సౌత్ పై బీజేపీ మరింతగా దృష్టి పెడుతోంది. కర్ణాటక ఎపిసోడ్ సక్సెస్ కావడంతో ఇక మిగతా దక్షిణాది రాష్ట్రాలపై  కాషాయ పార్టీ నజర్ పెడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అలిగి వెళ్లిపోయినా, మళ్లీ దగ్గరకు తీసుకున్నారు

బీజేపీని కర్ణాటకలో అధికారానికి తీసుకువచ్చిన నాయకుడు యడ్యూరప్ప. గనుల అక్రమ తవ్వకాల ఇష్యూ  తెరమీదకు రావడంతో 2012లో బీజేపీకి ఆయన గుడ్ బై కొట్టారు. ‘కర్ణాటక జనతా పక్ష ’ ( కేజేపీ)  పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. 2013 లో కర్ణాటక  అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో  ఈపార్టీకి  ఆరంటే ఆరే సీట్లు దక్కాయి. పెద్దగా  సీట్లు గెలుచుకోకపోయినా  బీజేపీని  చిత్తుగా ఓడించడంలో   యడ్యూరప్ప సక్సెస్ అయ్యారు.దీంతో,   బీజేపీ పెద్దలకు షాక్ తగిలినట్లయింది. అరుణ్ జైట్లీ  లాంటి వాళ్లు సముదాయించడంతో  2014 జనవరిలో  కర్ణాటక జనతా పక్ష ను  బీజేపీలో కలిపేసి మరోసారి సొంత ఇంట్లోకి  ప్రవేశించారు.   యడ్యూరప్ప అలా పార్టీ లోకి వచ్చారో, లేదో   లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల  ఎంపిక అధికారాన్ని కట్టబెట్టింది   బీజేపీ హై కమాండ్.  గతంలో శంకర్ సింఘ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్, కల్యాణ్ సింగ్ వంటి నాయకులు పార్టీ మీద అలిగి వెళ్లిపోయి మళ్లీ పార్టీలోకి చేరారు. అయితే వారిని కీలక పదవులకు దూరంగా ఉంచింది బీజేపీ హై కమాండ్. కానీ యడ్యూరప్ప ను మాత్రం కర్ణాటకలో టాప్ లీడర్ గానే ఉంచుతోంది. దీనికి కారణం యడ్యూరప్పను మించిన మరో నాయకుడు బీజేపీలో లేకపోవడమే.

ఏజ్​ బార్​ అయినా…

యడ్యూరప్పకు  బీజేపీ హై కమాండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చింది. బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారిని యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంచుతారు. కొన్నెళ్లుగా ఈ సంప్రదాయాన్ని బీజేపీ ఫాలో అవుతోంది. దీనిని చూపించే  లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషికి పార్టీ రెస్ట్ ఇచ్చింది. ఇప్పుడు యడ్యూరప్పకు 76 ఏళ్లు. అయినప్పటికీ  కర్ణాటకలో బీజేపీ ని బలోపేతం చేయడం కోసం  సంప్రదాయాన్ని బీజేపీ హై కమాండ్ పక్కన పెట్టింది.