విక్టరీ యెడియూరప్పదే

విక్టరీ యెడియూరప్పదే

ఆర్నెల్లుగా  యెడియూరప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. బైఎలక్షన్స్‌‌‌‌లో ప్రజలు బీజేపీ కేండిడేట్లను ఆశీర్వదించారు. ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన మాట పెద్దాయన నిలబెట్టుకున్నారు. ఇక రాజకీయాలు పక్కన పెట్టి పాలనపై  దృష్టిపెడతానన్నారు.

కర్ణాటక రాజకీయాలపై ముఖ్యమంత్రి యెడియూరప్ప తన పట్టు మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటివరకు అరకొర మెజారిటీతో సర్కార్ నడుపుకొస్తున్న ఆయన లేటెస్ట్​గా 15 నియోజకవర్గాలకు జరిగిన బైఎలక్షన్స్​లో 12 సీట్లలో విజయం సాధించి మేజిక్ ఫిగర్​కు మరో ఐదు సీట్లు అదనంగా చేర్చారు.ఈ బైఎలక్షన్స్ యెడియూరప్ప నాయకత్వానికి లిట్మస్ పరీక్షగా మారాయి. జూలైలో జేడీ(ఎస్), కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన యెడియూరప్ప మెజారిటీ సర్కార్ ఏర్పాటు చేస్తానని ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

ఒంటిచేత్తో ప్రచారం

బై ఎలక్షన్స్ హడావిడికి  బీజేపీ ఢిల్లీ పెద్దలు మొదటినుంచి దూరంగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లనెవరినీ  ప్రచారంలో పాల్గొనవలసిందిగా యెడియూరప్ప పిలవలేదు. అంతా తానే అయి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ ఉప ఎన్నికలను యెడియూరప్ప ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. పార్టీని చూసి కాదు….తనను చూసి ఓటేయాల్సిందిగా చాలా నియోజకవర్గాల్లో ఆయన అన్నట్లు తెలిసింది. ప్రచారంలో ఎక్కడా నేషనల్ ఇష్యూస్ జోలికి ఆయన వెళ్లలేదు. స్థానిక సమస్యలనే  లేవనెత్తారు. ఏ నియోజకవర్గంలో అడుగు పెడితే అచ్చంగా అక్కడి సమస్యలనే  ప్రస్తావించారు. ఆ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించారు. ఈసారి తమ పార్టీ కేండిడేట్​ను గెలిపిస్తే  వచ్చే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఏమేం చేస్తానన్న విషయాలను కూడా జనానికి అర్థం అయ్యేట్లు ఏకరువు పెట్టారు.  సూటిగా మాట్లాడి ప్రజలతో కనెక్ట్ అయ్యారు.

మంత్రిపదవుల హామీ వర్క్ అవుట్

పార్టీ మారి తనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి సాయం పట్టిన వాళ్లు బై ఎలక్షన్స్ లో గెలిస్తే  మంత్రులను చేస్తామని ఇచ్చిన హామీ కూడా ఈసారి వర్క్ అవుట్ అయింది. జేడీ (ఎస్), కాంగ్రెస్ కూటమి నుంచి అలిగి బీజేపీ వైపునకు వచ్చిన ఎమ్మెల్యేలంతా మామూలోళ్లు కారు. తమ తమ నియోజకవర్గాల్లో బాగా పరపతి ఉన్నవాళ్లు. పార్టీ ఏదైనా వ్యక్తిగత ఇమేజ్​ తో  గెలవగల సత్తా ఉన్నవాళ్లు.

గోకక్ సెగ్మెంట్ లో జార్ఖొలి కుటుంబానిదే హవా

సిద్దరామయ్య కేబినెట్ లో పనిచేసిన రమేష్ జార్ఖొలి కుటుంబానికి ‘గోకక్’ నియోజకవర్గంలో బాగా పలుకుబడి ఉంది. పార్టీలు ఇక్కడ నామమాత్రమే. జులై పరిణామాల తరువాత రమేష్ జార్ఖొలి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ కు కేండిడేట్ దొరక్క రమేష్  సోదరుడు లఖన్ కే ఈ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. బై ఎలక్షన్స్ జరిగిన వాటిలో మెజారిటీ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ అయింది.

అవసరమైన చోట లింగాయత్ కార్డు

పార్టీ కేండిడేట్ల గెలుపు కోసం రాత్రింబవళ్లు ప్రచారం చేశారు యెడియూరప్ప. ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడారు. ఒంటి చేత్తో మొత్తం ప్రచారాన్ని నడిపించారు.   బై ఎలక్షన్స్  జరిగిన వాటిలో ఆరు నియోజకవర్గాల్లో  లింగాయత్ కులస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కేండిడేట్ల జయాపజయాలను నిర్ణయించే సత్తా లింగాయత్ కులస్తులకు ఉంది. దీంతో లింగాయత్ కులానికే చెందిన యెడియూరప్ప క్యాస్ట్ కార్డు వాడుకోవడానికి కూడా వెనకాడలేదు.

బీజేపీకి మొదటి నుంచి పట్టున్న రాష్ట్రం

యెడియూరప్ప నాయకత్వంతో పాటు బీజేపీకి కర్ణాటకలో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. బీజేపీకి మొదటి నుంచి పట్టున్న రాష్ట్రంగా కర్ణాటకకు పేరుంది. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 244 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ 110 సీట్లు గెలుచుకుంది. యెడియూరప్ప నాయకత్వంలో దక్షిణాన తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.సౌత్ లో ఒక్క కర్ణాటకలో మినహా మరే ఇతర రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు.

కాంగ్రెస్ శిబిరంలో గొడవలు

యెడియూరప్ప ఒంటిచేత్తో ప్రచారం నిర్వహిస్తే  కాంగ్రెస్ చూస్తూ  ఉండిపోయింది తప్ప ఎదుర్కోవడానికి  పెద్దగా ప్రయత్నాలు చేయలేదంటున్నారు ఎనలిస్టులు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ ప్రెసిడెంట్ దినేశ్​ గుండూరావు …ఇద్దరే కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ ఇద్దరి పొడ గిట్టని మిగతా టాప్ లీడర్లు ప్రచారానికి దూరంగా ఉన్నారు.   ఉప ఎన్నికలు జరిగిన 15 సెగ్మెంట్లలో 12 సెగ్మెంట్లు ఇదివరకు కాంగ్రెస్ వే. అయితే ఈసారి కాంగ్రెస్​ కు కేవలం రెండు సీట్లే దక్కాయి.

పరువు పోయిన జేడీ (ఎస్)

ఈ బై ఎలక్షన్స్ లో బాగా పరువు పోగొట్టుకున్నది జేడీ (ఎస్).  మొత్తం15 సీట్లలో మూడు సీట్లు గతంలో జేడీ (ఎస్)వి. అయితే ఈసారి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కృష్ణరాజపేట నియోజకవర్గంలో ఓడిపోవడం జేడీ (ఎస్) కు పెద్ద మైనస్ పా యింట్. ఈ నియోజకవర్గం మొదటినుంచి జేడీ (ఎస్) కు పెట్టని కోట లాంటిది. యెడియూరప్ప  తరఫున ఆయన కొడు కు విజయేంద్ర ఇక్కడ  గల్లీగల్లీ తిరిగి బీజేపీ కేండిడేట్​ను గెలిపించారు.

పేరు మార్పు కలిసొచ్చిందట !

రాజకీయాల్లో చాలా మందికి రకరకాల నమ్మకాలుంటాయి. వీరిలో యెడియూరప్ప కూడా ఉన్నారు . కొంతకాలం కిందట ఆయన పేరు ‘యడ్యూరప్ప’ (Yedurappa) గా ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆయన తన పేరును ‘యెడియూరప్ప’(Yediyurappa) గా మార్చుకున్నారు. ఆయన పేరు మార్చుకున్నాక అన్నీ ఆయనకు కలిసొస్తున్నాయని బీజేపీలో టాక్ నడుస్తోంది.

బీజేపీకి పెద్ద రిలీఫ్

మహారాష్ట్ర  పరిణామాల తరువాత  కర్ణాటక బై ఎలక్షన్స్ ఫలితాలు బీజేపీకి పెద్ద రిలీఫ్ ఇచ్చాయని భావించాలి. శివసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 105   సీట్లు  గెలుచుకుని అతి పెద్ద పార్టీగా తెరమీదకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర శివసేనతో గొడవలు రావడంతో నెలరో జుల పాటు మహారాష్ట్రలో  హై డ్రామా నడిచింది. చివరకు  ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ చేసిన ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో జతకట్టి  శివసేన ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర  సంగతి ఎలాగున్నా  కర్ణాటక డెవలప్ మెంట్స్ ఢిల్లీ బీజేపీ నాయకులకు సంతోషాన్నిచ్చాయి.