నారాయణపేట జిల్లాలో సంబురంగా బండారు వేడుకలు

నారాయణపేట జిల్లాలో సంబురంగా బండారు వేడుకలు

మహబూబ్​నగర్​ ఫొటోగ్రాఫర్/నర్వ/మరికల్/​ఊట్కూరు, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే ఎల్లమ్మ, బీరప్ప బండారు (పసుపు) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కురుమలు ఈ దేవతలను ఆరాధ్య దైవంగా కొలుస్తూ ప్రతి ఐదేండ్లకోసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కర్నాటక, హైదరాబాద్​ ప్రాంతాల్లో స్థిరపడిన ఈ వర్గానికి చెందిన ప్రజలు సొంతూళ్లకు చేరుకుంటారు. బంధువులను ఆహ్వానించి పెద్ద ఎత్తున బండారు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 

ఒక్కో గ్రామంలో ఒక్కో రోజున ఈ ఉత్సవాలకు జరుపుతారు. బుధవారం నర్వ మండలం ఉందేకోడ్, మరికల్, ఊట్కూరులో ఉత్సవాలు నిర్వహించారు. ఉదయాన్నే ఎల్లమ్మ ఆలయాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనం మోసిన మహిళలు ఒళ్లంత వేప మండలు చుట్టుకొని ఊరేగింపుగా పట్టం వద్దకు చేరుకున్నారు. పట్టం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. వారి వెంట వచ్చిన బంధుమిత్రులు బండారు చల్లి ఆశీర్వదించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు కురుమలతో పాటు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.