- ధర్మపురి నియోజకవర్గ రైతులకు సాగునీటి గండం
- గతేడాదితో పోలిస్తే పడిపోయిన నీటిమట్టం
- 80 శాతం మేర నాట్లేసిన రైతులు
- నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన
జగిత్యాల, వెలుగు : గోదావరిలో ప్రవాహం తగ్గిపోవడంతో రోజురోజుకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్వాటర్నీటిమట్టం సగానికి పడిపోయింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ముఖ్యంగా ఏటా గోదావరితో పాటు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌పై ఆధారపడి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా పంటలకు సాగునీరు అందేది. గోదావరిలో ప్రవాహం తగ్గడంతో పొట్ట దశలో పంటలకు నీరు అందేనా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
10 వేల ఎకరాల్లో నాట్లు
జగిత్యాల జిల్లాలో గోదావరి ప్రాంతాలైన ధర్మపురి, వెల్గటూర్, బీర్పూర్ మండలాల్లో ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి దాదాపు 9 లిఫ్ట్‌ల కింద యాసంగిలో 10 వేల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. ఇది మొత్తం సాగులో సుమారు 80శాతం. గతేడాది ఇదే టైంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో 20 టీఎంసీలకుగానూ16 టీఎంసీలు ఉన్నాయి. అయితే గతేడాది నీటి కష్టాలు లేకపోవడంతో ఈ సారి రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు.
దీంతో 8వేల ఎకరాల నుంచి 10 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. మేడిగడ్డ కుగింపోయి, ఈసారి ఎక్కడిక్కడ ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు రాలేదు. దీంతో బ్యాక్ వాటర్ స్టోరేజీ 8 టీఎంసీలకు పడిపోయింది. లిఫ్ట్‌ల ఆధారపడిన రైతులకు ఎద్దడి తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది.
కెనాల్స్ రిపేర్లకు సర్కార్చర్యలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ధర్మపురి నియోజకవర్గ రైతులకు డీ-53, డీ64, డీ-83-ఏ, డీ-83- బీ, డీ- 63, డీ65, డీ 67 కెనాల్స్ పునురుద్ధరించాలని విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంను కోరారు. దీంతో కెనాల్స్‌కు రిపేర్లు చేపట్టి సాగునీరు అందించాలని ఇరిగేషన్ ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. నది ఒడ్డున ఉన్న ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లోని గ్రామాలకు గతంలో బోల్‌చెరువు నుంచి కెనాల్స్ ద్వారా కొంతవరకు సాగునీటిని అందించేవారు.
గతేడాది కురిసిన భారీ వర్షాలకు బోల్‌చెరువుకు గండి పడింది. దీనికి గత బీఆర్ఎస్ సర్కార్ రిపేర్లు చేయించలేదు. దీంతో ఇక్కడి రైతులకు గోదావరి లిఫ్ట్ లపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం లిఫ్ట్ లు కూడా పని చేసే పరిస్థితి లో లేకపోవడంతో తిరిగి కెన్సాల్స్‌ను రిపేర్లు చేసి సాగు నీరందించేందుకు సర్కార్ఆదేశాలు జారీ చేసింది.
నీటి ఎద్దడి తీర్చాలి
గతంలో ఎస్సారెస్పీ నుంచి బోల్ చెరువుకు నీటిని తరలించి ధర్మపురి నియోజకవర్గ రైతులకు సాగునీరందించేవారు. గత ప్రభుత్వ హయాంలో బోల్‌చెరువుకు గండిపడడంతో రైతులు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లిఫ్ట్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం బ్యాక్ వాటర్ కూడా లేకపోవడంతో రైతులకు నీటి ఎద్దడి తప్పదు. యాసంగికి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలి
ప్రకాశ్, ధర్మపురి రైతు