
- రెండు నెలల్లోనే 4.5 టీఎంసీలు వినియోగం
- ఎండలతో రోజుకు 100 క్యూసెక్కులు ఆవిరి
- మే నాటికి డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం
- ఇక నీటిని పొదుపుగా వాడుకోవాల్సిందే
మంచిర్యాల, వెలుగు:ఎండలు ముదురుతున్న కొద్దీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా యాసంగి పంటలకు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీంకు, రామగుండం ఎన్టీపీసీతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు మిషన్ భగీరథ స్కీంకు ఇక్కడినుంచే వాటర్ సప్లై చేస్తుండడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ఈ నెల 10వ తేదీ నాటికి నీటినిల్వ12.287 టీఎంసీలకు చేరింది. ఎగువన ఉన్న ఎస్పారెస్పీ, కడెం ప్రాజెక్టులతో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి నెల రోజులుగా ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రానున్న మూడు, నాలుగు నెలలు మిగిలిన నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 6 వరకు 1,110 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండగా, వారం రోజులుగా 845 క్యూసెక్కులకు తగ్గించారు.
అందుబాటులో 9 టీఎంసీలు..
ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 3.3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాదాపు 9 టీఎంసీలను వివిధ అవసరాల కోసం వాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గూడెం లిఫ్ట్ ద్వారా యాసంగి పంటలకు రోజుకు 290 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్ కోసం 313 క్యూసెక్కులు సప్లై చేస్తున్నారు.
రామగుండం ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు ఇస్తున్నారు. ఈ నెల 7 వరకు వేంనూర్ పంప్‌హౌస్‌కు 247 క్యూసెక్కులు లిఫ్టింగ్ చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతుండడంతో వేంనూర్, నందిమేడారం పంప్‌హౌస్‌లకు ఎత్తిపోతలు బంద్ చేశారు. ఔట్‌ఫ్లో1,110 క్యూసెక్కుల నుంచి 845 క్యూసెక్కులకు తగ్గించారు.
మే నాటికి డెడ్ స్టోరేజీకి..
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఏడాది జనవరి నాటికి 17 టీఎంసీలు నిల్వ ఉండగా, గత రెండు నెలల్లోనే 4.5 టీఎంసీలు వినియోగించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ రోజుకు 100 క్యూసెక్కులు ఆవిరయ్యే చాన్స్ ఉంది. ఇలా ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో మే నాటికి డెడ్ స్టోరేజీకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మిగిలిన నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్‌లో భారీ వర్షాలు కురిసి గోదావరికి వరదలు వస్తే నీటి కొరత తీరుతుంది. లేదంటే నీటికి కటకట తప్పదని అంటున్నారు.
యాసంగి పంటలకు తిప్పలే..
ప్రస్తుతం గూడెం లిఫ్ట్ ద్వారా కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు పరిధిలోని యాసంగి పంటలకు రోజుకు 290 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకే సాగునీరు అందిస్తామని అధికారులు ఇదివరకే ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఏప్రిల్ నెలాఖరులో పొలాలు కోతకొచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే చివరి ఆయకట్టుకు నీళ్లందక పంటలకు ఇబ్బందవుతోందని రైతులు పేర్కొంటున్నారు. నెలాఖరులో సాగునీరు నిలిపి వేస్తే ఏప్రిల్‌లో చేతికొచ్చే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.