క్షుద్ర పూజలు చేస్తే కోట్లలో డబ్బులు వస్తయ్

క్షుద్ర పూజలు చేస్తే కోట్లలో డబ్బులు వస్తయ్
  • ఒంటరి మహిళలను నమ్మించి మోసగిస్తున్న ముఠా
  • ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డి పోలీసులు 

తాడ్వాయి, వెలుగు : ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని.. క్షుద్ర పూజలు చేస్తే రూ. కోట్లలో డబ్బులు వస్తాయని నమ్మించి దోచుకుంటున్న ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం బ్రాహ్మణ పల్లికి చెందిన ఓ ఒంటరి మహిళను అదే గ్రామానికి చెందిన పైడకుల తిరుపతిరెడ్డి, స్వప్న దంపతులు క్షుద్ర పూజలు చేస్తే రూ. 2 కోట్లు వస్తాయని నమ్మించి ముందుగా కొంత డబ్బు తీసుకున్నారు. 

క్షుద్ర పూజలు చేసిన తర్వాత డబ్బులు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో బోధన్ కు చెందిన షేక్ గూడ్, నిజామాబాద్ కు చెందిన వాకలపూడి సత్యనారాయణ, బానోత్ మోతీలాల్, హైదరాబాద్ కు చెందిన జామలపూర్ సాయి కుమార్, గాంధారికి చెందిన శ్రీరాం సాయి, పైడకుల తిరుపతి ఉన్నారు.  వీరు గతంలో కూడా కొందరు మహిళలను క్షుద్రపూజలు పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేశారు. 

పూజలు చేసేటప్పుడు నగ్నంగా కూర్చొబెట్టి ఫొటోలు తీసి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి మరికొంత డబ్బు వసూలు చేసినట్టు నిందితులు అంగీకరించారు. కేసు నమోదు చేసి సోమవారం ఆరుగురు నిందితులను రిమాండ్ కు పంపారు. కేసును చేధించిన సదాశివనగర్ సీఐ సంతోశ్​కుమార్, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.