ఇల్లెందు, వెలుగు : సింగరేణి సంస్థ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గురువారం జేకే-5 ఓసీలో సింగరేణి ఆధ్వర్యంలో ‘ఉజ్వల సింగరేణి- ఉద్యోగుల పాత్ర’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి సంస్థ భవిష్యత్లో నిర్వహించబోయే నూతన విధానాలపై ఉద్యోగులందరికీ అవగాహన కలిగించేందుకు బొగ్గు గనులపై ఈ కార్యక్రమన్ని నిర్వహిస్తోందన్నారు.
ఉద్యోగులందరికీ సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, సింగరేణిలో వాడుకలో ఉన్న మిషనరీ పనితీరు, ఉత్పత్తి వ్యయం, కంపెనీ భవిష్యత్తు, ప్రణాళికలు, కార్మికులకు సంస్థ అందించే సంక్షేమ కార్యక్రమాలపై వివరిస్తామన్నారు. నూతన గనులు, థర్మల్, సోలార్ విద్యుత్, పంప్ స్టోర్ పవర్ ప్లాంట్, ఇతర వ్యాపార విస్తరణ అంశాలపై ఉద్యోగులకు, పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించిందని చెప్పారు. అనంతరం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు సహాపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం జాన్ ఆనంద్, ఎస్ఓటూ జీఎం బొల్లం వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షుడు శివ ప్రసాద్, ఏజీఎం (ఐడీ) ఎం.గిరిధరరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ మోహన్, మేనేజర్ పూర్ణ చందర్, డీజీఎం(పర్సనల్) జీవీ. మోహన్ రావు, డీజీఎం (సివిల్) రవి కుమార్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు
గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలి
కామేపల్లి : కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో పాడిపంటలతో గ్రామాలు సస్యశ్యామలంగా కళకళలాడాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. మండలంలోని పండితాపురంలోని కొత్త కాలనీ సెంటర్ లో శ్రీ మేరా మాయాడి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వారం రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. అమ్మవారి వద్ద మల్లిబాబు యాదవ్ దంపతులు ప్రత్యేక పూజ చేశారు.
మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎస్ కే ఫతే మహమ్మద్, మండల అధ్యక్షుడు గింజల నర్సిరెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.