- 2019 ఎన్నికల్లో ఇందూరు నుంచి 183 మంది స్వతంత్ర అభ్యర్థుల పోటీ
- పసుపు బోర్డు ఇవ్వలేదని కవితకు వ్యతిరేకంగా ప్రచారం
- బీజేపీకి కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్..
- ఇండిపెండెంట్లకు గతసారి ఎన్నికల్లో లక్షా 2 వేల ఓట్లు
- పసుపు బోర్డు చుట్టే ఎంపీ ఎన్నికల ప్రచారం..
నిజామాబాద్, వెలుగు: గత పార్లమెంట్ ఎలక్షన్‌లో నిజామాబాద్ నుంచి ఇండిపెండెంట్లుగా పోటీచేసిన పసుపు రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఆయా అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మొత్తం 186 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. అందులో 183 మంది రైతులు ఉన్నారు. దీంతో ఈ పోటీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి మరిచిపోయిందని మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత మీద ఆగ్రహంతో రైతులు ఎలక్షన్ లో పోటీ చేశారు.
దీంతో 183 మందికి సుమారు లక్షా రెండు వేల ఓట్లు వచ్చాయి. దీంతో కవిత ఓడిపోయింది. ప్రస్తుతం ఆ ఓట్లు ఎవరికి టర్న్ అవుతాయనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసినందున ఓట్లు తమకే పడతాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధీమాగా ఉన్నారు. బోర్డు ప్రకటనలకే పరిమితమైందని ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటుచేయించేది క్లారిటీ ఇవ్వకం మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఏర్పడేది హంగ్ ప్రభుత్వమేనని అప్పుడు తమ హవా ఉంటుందని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు.
పసుపు బోర్డే ప్రచారాస్త్రంగా..
2019 ఎలక్షన్‌లో బాండ్ పేపర్ రాసిచ్చి పోటీ చేసిన అర్వింద్ గతేడాది అక్టోబర్3న ప్రధాని మోదీతో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించారు. ఎనౌన్స్మెంట్తో మురిసిపోవద్దని బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో? క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తాను గెలిచాక నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు హామీ ఇస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి 22న నాటి సభలో ప్రసంగిస్తూ పసుపు బోర్డు హిమాచల్ ప్రదేశ్లోనా? శంకరిగిరి మాన్యంలోనా? అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సిట్టింగ్ఎంపీ అర్వింద్ ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. ఇందూర్ టు వారణాసి పసుపు బోర్డు జిల్లా రైతుల చిరకాల కోరిక. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని ఈ అంశం ప్రతి ఎన్నికల్లో ప్రచారాస్త్రం కావడం తర్వాత మరుగున పడడంతో రైతులు సత్తా చాటాలని డిసైడ్ అయి హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసి దాకా వెళ్లారు. అవరోధాలతో వెనక్కి తిరిగి వచ్చారు. లేకుంటే ప్రధాని మోదీ పోటీ చేసిన బ్యాలెట్‌లో ఇందూరు రైతుల పేర్లు ఉండేవి.
రైతుల ఓట్లు కీలకం
గత ఎన్నికల్లో రిజల్టును తలకిందులు చేసిన పసుపు రైతులు ఇప్పుడు ఎవరిని భుజానా మోయనున్నారనేది అంతుచిక్కకుండా మారింది. సీఎం కూతురుగా 2014లో ఎంపీగా కవితకు చాన్స్ ఇచ్చిన ఇందూరు సెగ్మెంట్ ప్రజలు 2019 లో మాత్రం కర్రుకాల్చి వాత పెట్టారు. బీఆర్‌ఎస్ నుంచి కవిత, బీజేపీ నుంచి అర్వింద్, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ గౌడ్ తో పాటు 183 మంది రైతులు పార్లమెంటు ఎలక్షన్ బరిలో నిలిచారు. అంతమంది అభ్యర్థులతో కూడిన పోలింగ్, కౌంటింగ్, అరెంజ్ మెంట్ల విషయంలో హైరానా చెందిన ఆఫీసర్లు స్పెషల్ ట్రైనింగ్‌తో గట్టెక్కారు.
అసలు రిజల్టు ఎలా రాబోతుందనే టెన్షన్ ఆఖరు దాకా కొనసాగింది. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన రైతులు 1,02,451 సాధించారు. బరిలోని ప్రతి ఇండిపెండెంట్‌కు నాలుగంకెలు, మూడంకెల ఓట్లు పడ్డాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంటెస్ట్ చేసిన కవితకు 4,09,709 ఓట్లు బీజేపీకి చెందిన అర్వింద్‌కు 4,80,584 పడగా 70,875 మెజారిటీతో ఆయన గెలుపొందారు. సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించమే టార్గెట్‌గా పసుపు రైతులు సక్సెస్ అయి ఆమెను ఇంటికి పంపారు.