- ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో సాగు
- గతేడాది క్వింటాల్ రూ.50 వేల నుంచి 1 లక్ష ధర
వరంగల్, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‍లోకి సరికొత్త ఎల్లో మిర్చి వచ్చింది. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‍లోని గుంటూరు కనిపించిన పసుపు మిర్చి సాగు గతేడాది తెలంగాణలోని ఒకట్రెండు ప్రాంతాల్లోని రైతులు పండించారు. ఇప్పుడు ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి జయశంకర్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. రైతులు ఆంధ్రప్రదేశ్‍లోని గుంటూర్ వెళ్లి సీడ్ తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. రెగ్యులర్ మిర్చి పంటతో పోలీస్తే తెగులు, పంట నష్టం తక్కువగా ఉండగా.. మంచి రేటు వస్తుందని రైతులు చెబుతున్నారు.
గతేడాది క్వింటాల్‍ధర రూ.60 వేల నుంచి లక్ష వరకు పలికింది. అదే ఆశతో ఈసారి మన రాష్ట్రంలోని రైతులు ఎల్లో మిర్చి సాగు చేశారు. పంట చేతికి రావడంతో రైతులు ఏనుమాముల మార్కెట్లో విక్రయించేందుకు వచ్చారు. కాగా, ఎంతోకొంత రైతుకు లాభదాయకంగా ఉండే ఎల్లో మిర్చి రేటును సగానికి సగం తగ్గించడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
ఎకరానికి రూ.80 వేల ఖర్చు.. 15 క్వింటాళ్ల దిగుబడి
ఎల్లో మిర్చి సాగుకు ఎకరానికి రూ.60 వేల నుంచి లక్ష వరకు ఖర్చు వస్తున్నట్లు రైతులు తెలిపారు. పంట చేతికొచ్చేసరికి సగటున రూ.80 వేలు ఖర్చు వస్తోందన్నారు. ఎకరానికి 13 క్వింటాళ్లు.. గరిష్ఠంగా 18 ఎకరాలు వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాగు చేస్తున్న ఎల్లో మిర్చికి మార్కెట్‍లో ఫుల్లు డిమాండ్‍ఉంది. గతేడాది ఒక్కో క్వింటాల్‍కు రూ.60 వేల నుంచి లక్ష రూపాయల ధర పలికినట్లు ఖమ్మం జిల్లా తిప్పారెడ్డిగూడెనికి చెందిన రైతు కోట్ల ఉపేందర్ తెలిపారు.
పంటకు డిమాండ్ రావడం కోసం తాను క్వింటాల్‍కు రూ.500 చొప్పున ఖర్చు చేసి కోల్డ్ స్టోరేజీలో పెట్టడం ద్వారా క్వింటాల్‍కు రూ.లక్ష వరకు సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. భూపాలపల్లికి చెందిన రైతులు సైతం గతేడాది రూ.50 వేల చొప్పున విక్రయించినట్లు తెలిపారు. ఎకరానికి రూ.80వేలు ఖర్చు చేయగా.. దాదాపు రూ. 5లక్షల వరకు లాభ పడినట్టు చెప్తున్నారు. మిగతా రకం మిర్చిలతో పోలిస్తే ఈ మిర్చి ఘాటు చాలా తక్కువ.
దేశ, విదేశాల్లోని ఫైవ్‍స్టార్ హోటళ్లలో దీన్ని ఎక్కువ వాడతారు. అందుకే అంతర్జాతీయంగా కూడా దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. గతేడాది క్వింటాల్‍కు రూ.45 వేల నుంచి లక్ష పలుకగా ఈసారి ఏనుమాముల మార్కెట్లో కేవలం రూ.20,100 ధర నిర్ణయించారు. తక్కువ ధరతో కొనుగోలు చేసి కొన్నాళ్ల పాటు స్టోర్ చేసి, ఎక్కువ ధరకు అమ్ము కొని దళారులు లాభపడాలని చూస్తున్నారు.
పోయినేడాది రూ.45 వేలు..ఇప్పుడు 20 వేలు
గుంటూరు మార్కెట్‍లో చూసి గతేడాది 30 గుంటల్లో ఎల్లో మిర్చి సాగు చేసిన. 12 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. అప్పుడు పంట మార్కెట్ తీసుకొస్తే క్వింటాల్‍కు రూ.45 వేలు ఇచ్చిన్రు. ఈసారి అదే ఆశతో పంట వేశా. దిగుబడి వచ్చింది. మార్కెట్ పడిపోయిందని చెప్పి క్వింటాల్‍కు రూ.20,100 రేట్ అంటున్రు.
- గుర్జ రామారావు, నిజాంపల్లి, గోరికొత్తపల్లి
మిర్చికి డిమాండున్నా.. దళారులదే రాజ్యం
ఎకరానికి దాదాపు రూ.50 వేల నుంచి 60 వేల వరకు ఖర్చు పెట్టినా. 17 నుంచి 18 ఎకరాల్లో వేశా. ఈ మిర్చికి బయట మంచి ధర ఉన్నా.. ఏనుమాముల మార్కెట్‍లో కావాలనే రేటు సగం కంటే ఎక్కువగా తగ్గించారు. ఎల్లో మిర్చితో భాగానే ఉన్నా దళారులతే రాజ్యం అవుతాంది.
- సారయ్య, గొర్లవీడు తండా, భూపాలపల్లి