బీఆర్ఎస్ లీడర్లు సంపుతమంటున్నరు : యెండల లక్ష్మీనారాయణ

  • అంబేద్కర్ చౌరస్తాలో మౌన దీక్ష  
  • పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

బాన్సువాడ, వెలుగు : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తన ఇంటికి మంగళవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ లీడర్లు వచ్చి, తన డ్రైవర్లు దత్తు, కిశోర్ లపై దాడి చేశారని, తనను చంపుతానని బెదిరించారని బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ బుధవారం పీఎస్​లో ఫిర్యాదు చేశారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తా వద్దకు పాదయాత్రగా వచ్చి నోటికి నల్ల గుడ్డ కట్టుకొని మౌన దీక్ష చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అతడి అనుచరులతో కలిసి వచ్చి తన డ్రైవర్లపై దాడి చేసి, ‘బాయ్ సాబ్ ను చంపుతాం’  అంటూ వార్నింగ్​ఇచ్చారని వాపోయారు.

గ్రౌండ్ ఫ్లోర్​లో డ్రైవర్లపై దాడి చేసి, ఫస్ట్ ఫ్లోర్ కు వచ్చి తలుపులు కొట్టి భయాందోళనలు సృష్టించారన్నారు. అయినా దాడి చేసిన బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంతో బుధవారం రాత్రి డీఎస్పీ ఆఫీస్ ​ముందు   బైఠాయించారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తానన్నారు.  ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చేతులు దులుపుకోకుండా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజీపీ కార్యకర్తలు ఆవేశానికి లోనుకావొద్దని, పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించాలన్నారు.