మా ఊరిలో మల్లన్న సాగర్ వద్దు అని కేసీఆర్ సర్కార్‌తో మా కొట్లాటకు మద్దతుగా 2016 జూన్ 25, 26 రెండు రోజులు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష చేసిండు. రేవంత్సార్కు మా ముంపు గ్రామాల బాధలన్నీ తెలుసు. మాకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి మాతోని మాట్లాడి ఆదుకుంటాడని భావిస్తున్నాం’ అని.. ఏటిగడ్డ కిష్టాపూర్ ముంపు బాధితులు ఆశిస్తున్నారు.
2016 జూన్ నెలలో ‘మల్లన్న సాగర్ వద్దు మా గ్రామం మాకే ముద్దు’ అనే నినాదంతో ముంపునకు గురైన 14 గ్రామాలోని ప్రజలు మల్లన్న సాగర్ నిర్మాణానికి, అప్పటి ప్రభుత్వానికి, వ్యతిరేకంగా చాలా తీవ్రంగా ఉద్యమించాం. ఆ సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. జూన్ నెలలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో రెండు రోజులు నిరాహార దీక్ష చేసి ఉద్యమానికి ఊపిరి ఊదారు. రేవంత్‌రెడ్డి నిరాహార దీక్ష తర్వాత రెండు నెలలు తీవ్రంగా ఉద్యమం కొనసాగింది. ఆ తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కుయుక్తులతో రెవెన్యూ రికార్డులలో ఉన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని బ్రోకర్ల ద్వారా గ్రామం బయట ఉన్న వ్యక్తుల చేత, మల్లన్న సాగర్ ఉద్యమ ద్రోహుల చేత ప్రభుత్వం దొంగచాటుగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దీంతో భయపడిన ముంపు గ్రామస్తులు ప్రభుత్వంతో (ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆనాటి దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆనాటి (జాయింట్ కలెక్టర్) కలెక్టర్ వెంకట్రాం రెడ్డి ) పలుమార్లు చర్చలు జరిపి ఒక ఎకరానికి 5,85,000 నుంచి 6 లక్షల రూపాయలకు ఒప్పించిన తర్వాత వేములఘాట్ గ్రామం మినహా మిగిలిన అన్ని గ్రామాలు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఆయా గ్రామాలలోనే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.
గుడికి గుడి, బడికి బడి
గుడికి గుడి, బడికి బడి, ఇల్లుకి ఇల్లు, శ్మశానానికి శ్మశానం కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి కూడా14 ఊర్లకు ఒక్క శ్మశానవాటిక లేకపోవడంతో ఒక శవం కాలేదాకా ఇంకొక శవం ఖననం కోసం రోడ్డుమీద ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఆనాటి రాజకీయ నాయకులు ఆయా గ్రామాలకు ఇచ్చిన వాగ్దానాలు వేటిని కూడా నెరవేర్చలేదు. ముంపు గ్రామాల ప్రజలు 2016 ప్రభుత్వంతో చర్చలు జరిపేటప్పుడు అన్ని రకాల న్యాయమైన నష్టపరిహారం అందరికీ ఇచ్చి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మించిన ఇంటి తాళం చెవిని..మీకు ఇచ్చిన తర్వాతనే మీరు గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు అన్నారు. ఆనాటి సీఎం కేసీఆర్‌ను ప్రత్యక్షంగా కలిసి మా బాధలను చెప్పుకుంటామంటే అప్పటి మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకట్రాం రెడ్డి .. మీరు సగం భూములను రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సీఎంతో మీటింగ్‌తో పాటు సహపంక్తి భోజనం ఏర్పాటు చేయిస్తామని, అప్పుడు మీ డిమాండ్లను ముఖ్యమంత్రితో ప్రత్యక్షంగా చెప్పండి అని వాగ్దానం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి కూతవేటు దూరంలో ఉన్నది. తెలంగాణ గుండెకాయ, వరప్రదాయని అని చెప్పుకుంటున్న మల్లన్న సాగర్ నిర్మాణానికి సుమారు 20,000 ఎకరాలు,14 గ్రామాలు, పదివేల జనాభా, చెట్టుకొకరు గుట్టకొకరు, చెట్టిడిసిన పక్షులోలే బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు వదులుతున్నారు.
ప్రభుత్వం మారితే... బతుకులు మారతాయని..
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధలను చెప్పుకుందామంటే నిర్వాసితులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడు సంవత్సరాలు అయినా అపాయింట్మెంట్ ఇయ్యకపాయే! మా మాటలు వినకపాయే! అని ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన, అసంతృప్తితో ఉన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి సహకరించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలకు నిలయాలుగా మారాయి. అత్యంత నాణ్యత లోపంతో ఇంటి నిర్మాణాలు, ప్యాకేజీలు, ఓపెన్ ప్లాట్లు, 65 సంవత్సరాలు పైబడిన పండు బారిన ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులకు ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇల్లు ఇవ్వకపోవడంతో కొంతమంది దీనావస్థలో చనిపోయారు. బతికే ఉన్న ముసలివాళ్లు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉపాధి లేక చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
హామీలు బురదలోకి..
ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బురదలో తొక్కి ఆనాటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు 2021లో నిర్దాక్షిణ్యంగా పోలీసుల సాయంతో బలవంతంగా 14 ఊర్లను ఖాళీ చేయించారు. గజ్వేల్ పట్టణ సమీపంలో ఉన్న ముట్రాజ్ పల్లి శివారులో తాత్కాలిక డబుల్ బెడ్రూంలు కొన్ని గ్రామాలకు, శాశ్వత బెడ్రూంలను కొన్ని గ్రామాలకు కేటాయించారు. గ్రామాలు ఖాళీ చేయడానికి కనీస సమయం ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాల సామాన్లు మల్లన్న సాగర్‌లో కలిసిపోయాయి. అన్ని పరిహారాలు వచ్చేవరకు ఖాళీ చేయమని ముంపు గ్రామాల బాధితులు అంటే.. ఆనాటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఇతర అధికారులు మీరు ఖాళీ చేసిన తర్వాత నెల రోజుల లోపు మీకు న్యాయంగా రావలసిన అన్ని రకాల పరిహారాల చెక్కులు మీ ఇంటికి తెచ్చి ఇచ్చే బాధ్యత నాది నన్ను నమ్మండని హామీ ఇచ్చారు. కలెక్టర్ మాటలను వినకపోతే బ్రిటీష్ వారి పాలసీ "విభజించు పాలించు" అనే పద్ధతి ద్వారా గ్రామస్తులను విడదీసి అందులో నాయకులను పిలిపించి మీకు ఏమి కావాలో తీసుకొని ఖాళీ చేయమని చెప్పి గ్రామస్తుల మధ్యన చిచ్చు పెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పుకోసం గ్రామాలను ఖాళీ చేయించిన ఘనత కలెక్టర్ వెంకట్రాంరెడ్డిది.
సీఎం చొరవతోనే న్యాయం జరుగుతుంది
2016 సంవత్సరం కంటే ముందు ముంపు గ్రామాల రైతులు క్రాప్ లోన్ తీసుకొని సర్వస్వం కోల్పోయినా నోటీసులు పంపిస్తూ రికవరీ కోసం బ్యాంక్ అధికారు లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. స్పెషల్ జీవో తీసుకువచ్చి ముంపు బాధితుల క్రాప్ లోన్లు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం మారితే ముంపు గ్రామాల ప్రజల బతుకులు మారుతాయని ఆశించినట్లే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని ముంపు గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సార్.. మా ముంపు గ్రామాల ప్రజల వెతలు, కష్టాలు, నష్టాలు మీకు తెలియని కావు. కాబట్టి మీరైనా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు న్యాయంగా రావలసిన నష్ట పరిహారాలను ఇప్పించి.. మమ్ములను మనుషులుగా చూడాలని ముంపు గ్రామాల ప్రజలు ఆశిస్తున్నారు. వారి ఆవేదనను సీఎం రేవంత్‌రెడ్డి అర్థం చేసుకొని న్యాయం చేస్తారని నిర్వా సితులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
- పులి రాజు,
సామాజిక కార్యకర్త