మానసిక ఒత్తిడి తగ్గాలంటే..

శారీరకంగా ఫిట్​గా, హెల్దీగా ఉండటానికి బోలెడు డైట్​ ప్లాన్లు​ ఉన్నాయి. మరి మానసిక ఆరోగ్యం మాటేంటి? దానికోసమే ఈ యోగాసనాలు.. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తి, ఏకాగ్రత పెంచుతాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. కండరాల్ని బలంగా చేస్తాయి. మరిన్ని లాభాలున్న యోగాసనాల్ని ఎలా వేయాలంటే.. 

ఉత్తనాసనం/పశ్చిమోత్తనాసనం: ఈ రెండు ఆసనాల పేర్లు వేరయినా, చూడటానికి ఒకేలా ఉంటాయి. రెండింట్లో ఏది చేసినా రిజల్ట్​ మాత్రం ఒకటే. ఉత్తనాసనాన్ని నిల్చొని, పశ్చిమోత్తనాసనాన్ని కూర్చొని వేయాలి. వీటిని ఎలా చేయాలంటే నడుమును ముందుకు వంచాలి. ఛాతి, నుదురు మోకాళ్లకు ఆన్చాలి. తరువాత గాలి బాగా పీల్చుతూ వదలాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు, జీర్ణ సమస్యలు, హైబీపీ కూడా తగ్గుతాయి. 

సీతలి/ సీత్కారి ప్రాణాయామం: ఈ ఆసనం కోసం వజ్రాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి. నోరు తెరిచి నాలుకను కింది దవడకు ఆన్చాలి. తరువాత నోటితో గాలి పీల్చుతూ వదలాలి. ఇదే విధంగా పళ్లను గట్టిగా బిగపట్టి నోటితో గాలి పీల్చుతూ వదలాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్‌‌ తగ్గడమే కాక శరీరంలో వేడి తగ్గుతుంది. 
ఆకలి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.