45 రోజుల్లో 30 కోట్ల డబ్బు : కుంభమేళాలో ఓ బోట్ యజమాని సక్సెస్ స్టోరీ

45 రోజుల్లో 30 కోట్ల డబ్బు : కుంభమేళాలో ఓ బోట్ యజమాని సక్సెస్ స్టోరీ

మహా కుంభమేళా.. 70 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు.. ప్రయాగరాజ్ జన సంద్రాన్ని తలపించింది. ఇదంతా పుణ్యం కోసం వెళ్లిన జనం.. అక్కడ ఉన్న జనం ఏం చేశారు.. భక్తుల కోసం తమ వంతు సాయం చేశారు.. వ్యాపారం చేశారు.. మొన్నటికి మొన్న ఓ 20 ఏళ్లు కుర్రోడు టీ అమ్ముతూ రోజుకు 5 వేల రూపాయలు సంపాదిస్తే.. ఇప్పుడు ఓ పడవ యజమాని 45 రోజుల్లో 30 కోట్ల రూపాయలు సంపాదించిన కథ వెలుగులోకి వచ్చింది. ఇది చెప్పింది ఎవరో కాదు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్

కుంభమేళాకు వెళ్లిన కోట్ల మంది భక్తుల్లో చాలా మంది నది లోపలికి వెళ్లి పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానం చేయటానికి బోట్లలో వెళ్లారు. అలా బోట్లలో వెళ్లాలంటే ఆయా రోజులను బట్టి.. ఒక్కో వ్యక్తికి 2 వేలు నుంచి 5 వేల రూపాయలు వరకు ఛార్జ్ చేశారు. 

నది మధ్యలో.. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే చోటకు వెళ్లటానికి కోట్ల మంది భక్తులు పోటీ పడ్డారు. అలా బోటు యజమానులు దండిగా డబ్బులు సంపాదించారు. పడవలు నడిపే ఓ వ్యక్తి.. 45 రోజుల్లో 30 కోట్ల రూపాయలు సంపాదించినట్లు చెప్పుకొచ్చారు సీఎం యోగీ. 

ఒక్క ప్రభుత్వానికే కాదు.. ఓ బోటు యజమాని 45 రోజుల్లో 30 కోట్ల రూపాయలు సంపాదించటం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. వేలాది బోట్లు త్రివేణి సంగమానికి వెళ్లి వచ్చాయి. అన్ని బోట్ల యజమానుల ఆదాయం వేల కోట్ల రూపాయలుగానే ఉంది. ఒక్కో బోటు 24 గంటలూ పని చేసింది.. రోజూ పదుల సంఖ్యలో ట్రిప్పులు వేసింది. ఈ లెక్కన ప్రతి బోటు యజమాని కోట్ల రూపాయలే సంపాదించారు అనటంలో సందేహం లేదు కదా..

మహా కుంభమేళా ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. రవాణా, భోజనాలు, లాడ్జీలు, వసతులు ఇలా అనేక సౌకర్యాలకు భక్తులు పెట్టిన ఖర్చుతో.. యూపీ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో వచ్చాయి.