జిల్లాకు జాతీయ అవార్డు సాధించాలి :  యోగితా రాణా

 జిల్లాకు జాతీయ అవార్డు సాధించాలి :  యోగితా రాణా

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు : జాతీయ స్థాయిలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు  అవార్డు తీసుకురావడమే లక్ష్యంగా ఆఫీసర్లు, ఉద్యోగులు పని చేయాలని కేంద్ర ప్రభారి ఆఫీసర్, వ్యవసాయ శాఖ జాయింట్​సెక్రటరీ యోగితా రాణా సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణకు ఏర్పాటు చేసిన సెంటర్​ను కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు.

అనంతరం కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో మాట్లాడారు. సంపూర్ణ అభియాన్​లో భాగంగా ఆస్పిరేషనల్​​ జిల్లాలకు భద్రాద్రి జిల్లా ఆదర్శంగా ఉండాలన్నారు. జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన మొదటి పోస్టింగ్ భద్రాచలంలోనే అని తెలిపారు. గుండాల మండల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.

పోష్టికాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి అంగన్​వాడీ కేంద్రాల ద్వారా సరైన పోష్ఠికాహారం అందించాలన్నారు. ప్రతి రైతు పొలంలో భూ సార పరీక్షలు నిర్వహించేలా చూడాలని చెప్పారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో అంధ, మూగ, చెవిటి పిల్లల కోసం ప్రత్యేక చాంబర్​ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభారి కార్యదర్శి పవన్, అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, కేవీకే సైంటిస్ట్​ డాక్టర్​ ఆర్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

పలు ప్రాంతాల్లో పర్యటన.. 

సుజాతనగర్, వెలుగు :  సంపూర్ణ అభియాన్ కార్యక్రమం లో భాగంగా గురువారం పలు ప్రాంతాల్లో యోగితా రాణా, జితేశ్ వి.పాటిల్ పర్యటించారు. లక్ష్మీదేవిపల్లి చెక్ డ్యామ్ ను పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులను డ్యామ్ కు ఎన్ని నిధులు మంజూరు అయినవి, ఎంతవరకు పనులు పూర్తి అయినవి అడిగి తెలుసుకున్నారు. చెక్ డ్యామ్ కు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం వేపలగడ్డ అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు,  పిల్లలకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. గర్భిణులకు శ్రీమంతాలు చేసి సెంటర్​ ఆవరణలో మొక్కలు నాటారు.  సర్వారం గ్రామంలోని పల్లె దవాఖానాను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంఎచ్ వో భాస్కర్ నాయక్, ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ విజేత, డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, ఐసీడీఎస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.