Kapil Dev: కపిల్ దేవ్‌ను చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను: యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ యోగరాజ్ సింగ్.. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ తన ఆవేదనను వెల్లడించాడు. తన కెరీర్ త్వరగా ముగిసి పోవడానికి కపిల్ దేవ్ కారణమని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 1983 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలిచిన తర్వాత కపిల్ దేవ్ ఎలాంటి కారణం లేకుండా తనను తొలగించాడని ఆరోపించాడు. 

అన్‌ఫిల్టర్డ్ బై సమ్దీష్‌లో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. " 1983 లో కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్ తో పాటు నార్త్ జోన్, హర్యానాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో కపిల్ ఎటువంటి కారణం లేకుండా నన్ను తొలగించాడు. నా భార్య (యువీ తల్లి) నన్ను ఎందుకు జట్టు నుంచి తప్పించారో కపిల్ దేవ్ ను అడగాలనుకుంది. కపిల్ దేవ్ కు నేను గుణపాఠం చెబుతానని వాళ్ళ ఇంటికి నా పిస్టల్ తీసుకొని వెళ్ళాను. అతను తన తల్లితో బయటకు వచ్చాడు. కపిల్ దేవ్ తన తల్లితో బయటకు రాగానే "నేను మీ తలకు పిస్టల్ గురి పెట్టి చంపాలనుకున్నాను. నీ పక్కన నిలబడి ఉన్న మీ తల్లి కారణంగా నేను అలా చేయడం లేదు". అని యోగరాజ్ సింగ్ కపిల్ దేవ్ ను అన్నట్టు  చెప్పారు. 

ALSO READ | Team India: బీసీసీఐ రివ్యూ మీటింగ్.. రంజీ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ, రోహిత్

డిసెంబర్ 21, 1980న బ్రిస్బేన్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో యోగరాజ్ సింగ్ తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో అతను తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. యోగరాజ్ సింగ్ అంతర్జాతీయ కెరీర్ కేవలం మూడు నెలలకే పరిమితమైంది. భారత జట్టు తరపున ఒక టెస్టు, ఆరు వన్డేలు మాత్రమే ఆడాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమాల్లో నటించిన యోగరాజ్ సింగ్.. ఇన్నేళ్లలో కపిల్ దేవ్ గురించి మాట్లాడం ఇదే తొలిసారి. కపిల్ దేవ్ తో పాటు మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీపై యోగరాజ్ షాకింగ్ ఆరోపణలు చేశాడు. బిషన్ సింగ్ బేడీ తనపై కుట్ర పన్నాడని చెప్పుకొచ్చాడు.