400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్‍పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్‍పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

మే 8న హైదరాబాద్‌ గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. మొదట రాహుల్ సేన 165 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89*), అభిషేక్ శర్మ (75*)లు 9.4 ఓవర్లలోనే ఛేదించారు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై.. లక్నోయజమాని సంజీవ్ గోయెంకా తీవ్రంగా విరుచుకు పడ్డారు.

సాధారణంగా ఫ్రాంచైజీల యజమానులు.. గెలుపోటములపై ఆటగాళ్లతో చర్చించారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా.. నాలుగు గోడల మధ్య అలాంటివి జరుగుతాయి. అయితే, లక్నో యజమాని ఆ సమయం వరకూ కూడా ఓపిక పట్టలేదు. బౌండరీ లైన్ వద్దే రాహుల్‌కు క్లాస్ తీసుకున్నాడు. అతని నిర్ణయాలను ఎత్తిచూపుతూ బహిరంగంగానే విమర్శించాడు. ఈ ఘటన అనంతరం ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా, ఇదే విషయం మాట్లాడిన భారత మాజీ డాషింగ్ ఓపెనర్.. సంజీవ్ గోయెంకాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

400 కోట్లు సంపాదిస్తున్నారు..

యజమాని ఆటగాళ్లను కలుసుకుని వారిని ప్రేరేపించాలే కానీ, వారిని విమర్శించకూడదని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. టోర్నీ వల్ల సంజీవ్ గోయెంకా 400 కోట్లు సంపాదిస్తున్నారని, అలాంటప్పుడు ఓటమి వల్ల అతనికి వచ్చిన నష్టమేంటని సెహ్వాగ్ ప్రశ్నించారు.  

"వీళ్లు వ్యాపారస్తులు. వారికి లాభ నష్టాలు మాత్రమే అర్థం అవుతాయి. కానీ ఇక్కడ నష్టం లేదు. 400 కోట్ల లాభం పొందుతున్నారు. మరి వారికొచ్చిన ఇబ్బంది ఏమిటి? ఏమి జరిగినా మీ లాభం మీరు పొందుతున్నారు కదా..! ఇక్కడ నా ఉద్దేశ్యం వేరు. ఆట గురించి చర్చించడానికి కోచ్, ఇతర సిబ్బంది ఉన్నారు. కాబట్టి మీ పని ఆటగాళ్లను ప్రేరేపించడం మాత్రమే కావాలి.." సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో మాట్లాడారు. వీరేంద్రుడి వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు సమర్థిస్తున్నారు.