Postal Insurance: ఆ స్కీములో రోజూ రూ.50 దాస్తే.. రూ.35 లక్షలు చేతికి, డబ్బులు 100% సేఫ్..

Postal Insurance: ఆ స్కీములో రోజూ రూ.50 దాస్తే.. రూ.35 లక్షలు చేతికి, డబ్బులు 100% సేఫ్..

Gram Suraksha Yojana: దేశంలో చాలా మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తమ డబ్బును పోస్టాఫీసుల్లో దాచుకుంటుంటారు. భారత ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్న ఈ సంస్థ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పొదుపు పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. అయితే వాటిలో భారీగా ప్రజాధరణ పొందినదే గ్రామ సురక్ష యోజన అనే లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిలో రాబడి కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు పెట్టిన డబ్బు100 శాతం సురక్షితంగా ఉంటుంది. 

ఈ స్కీమ్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల బీమా అవసరాలను తీర్చే లక్ష్యంతో 1995లో తీసుకురాబడింది. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండే వ్యక్తులు దీనిని ఉపయోగించుకోవటానికి అర్హులు. స్కీమ్ కింద రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు సమ్ అష్యూర్డ్ అందించబడుతోంది. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే పాలసీదారులు తమ ప్రీమియం నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి, అర్థసంవత్సరానికి ఒకసారి లేదా వార్షికంగా ఒకసారి చెల్లించవచ్చు. 

ఎవరైనా వ్యక్తి ఈ స్కీమ్ కింద నెలకు రూ.వెయ్యి 515 చెల్లిస్తే వారు చివరికి రూ.35 లక్షల వరకు రాబడిని పొందవచ్చు. అంటే రోజుకు సంపాదించే దానిలో కనీసం రూ.50 దీనికోసం కేటాయించటం వల్ల అనుకోని సంఘటన జరిగినప్పుడు పాలసీదారుని కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించబడుతుంది. అయితే ఇంత మెుత్తంలో రాబడిని అందుకోవాలంటే మీరు 19 ఏళ్ల వయస్సు నుంచి 55 ఏళ్లు వచ్చేవారు ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 58 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకాన్ని తీసుకుంటే.. మీరు ప్రతి నెలా రూ.1,463 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయస్సు వరకు అయితే ప్రతి నెలా రూ.1,411 చెల్లించాలి. 60 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడిపై రూ.34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పాలసీదారు అందుకుంటారు.

పాలసీ మెుత్తాన్ని 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత సదరు వ్యక్తికి అందిస్తారు. ఒకవేళ అతను మరణించినట్లయితే వారి నామినీకి చట్టప్రకారం ప్రయోజనాలు అందించబడతాయి. పాలసీని సరెండర్ చేయటానికి కనీసం మూడేళ్లు వేచి ఉండాల్సి ఉంటుంది. ఐదేళ్లలోపు సరెండర్ చేసే పాలసీలపై ఎలాంటి బోనస్ ప్రయోజనాలను పోస్టల్ డిపార్ట్మెంట్ అందించదు. చివరిగా ప్రతి వెయ్యి పెట్టుబడిపై రూ.60 బోనస్ అందించింది. ప్రీమియం చెల్లింపులకు వయస్సును 55, 58, 60 వరకు ఎంచుకునేందుకు అవకాశం ఉంది. అలాగే పాలసీ చెల్లింపులు నాలుగేళ్లు చేసిన తర్వాత దీనిపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.