ఐదేండ్ల పరీక్ష రాసిన... మార్కులు మీరే వేయాలి : మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు :  తెలంగాణ కోసం ఉద్యమించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం బయలుదేరారని, వారి చేతికి అధికారాన్నిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలే తన కుటుంబమనుకుని పనిచేస్తున్నానని, ఇక్కడి ప్రజలకు మేలు జరగాలన్నదే తన తపన అని అన్నారు.

‘ప్రజల మనసులోని ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి అనే ఐదేండ్ల పరీక్ష రాశాను. అ పరీక్ష మార్కులు మీరే వేయండి’ అని కోరారు. మన సిద్దిపేట మట్టిబిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లే సిద్దిపేటలో ఇంతటి అభివృద్ది  సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ చౌరస్తా నుంచి లాల్ కమాన్, గాంధీ చౌక్, విక్టరీ టాకీస్ చౌరస్తా, భారత్ నగర్, గణేశ్​నగర్, మెదక్ రోడ్డు మీదుగా పాత బస్టాండు వరకు రోడ్ షో నిర్వహించారు.