డబుల్​ ఇండ్ల కోసం  డబ్బులివ్వాల్సిందే!

  •     రూ.లక్ష ఇస్తే ఇల్లు అలాట్ ​పక్కా
  •     పూర్తి కాకున్నా లబ్ధిదారుల ఎంపిక
  •     హడావుడి చేసిన అధికారులు
  •     నిర్మాణానికి మరో ఏడాది ఆగాలే
  •     అవకతవకలపై కలెక్టర్​కు నోటీసులిచ్చిన లీగల్​సెల్ ​అథారిటీ చైర్మన్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం పక్కదారి పడుతోంది. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో డబుల్ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలంటే మరో ఏడాది పడుతుంది. మరోవైపు ఆఫీసర్లు మాత్రం లబ్ధిదారులకు డబుల్ ఇళ్లను అలాట్​చేస్తున్నారు. పాల్వంచ పట్టణంలోనూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అయినా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్​బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే పారదర్శకంగా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అనర్హులకు కూడా కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. డబుల్​బెడ్ రూం వచ్చిన తర్వాత రూ. లక్ష నుంచి రూ.3లక్షలు ఇవ్వాలంటూ కొందరు కౌన్సిలర్లు దందా సాగిస్తున్నారు. పలువురు కౌన్సిలర్లు తమ బంధువులు, అనుచరులకు ఇండ్లు కేటాయించుకున్నారు. డబుల్ బెడ్​రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలపై కలెక్టర్​కు జిల్లా లీగల్​సెల్ అథారిటీ చైర్మన్ నోటీలివ్వడం కలకలం సృష్టిస్తొంది.  

గందరగోళంలో లబ్ధిదారులు

జిల్లా కేంద్రంతోపాటు పాల్వంచ మున్సిపాలిటీలో డబుల్ బెడ్​రూం ఇళ్ల ఒక్కటీ కంప్లీట్ కాలేదు. అయినా ఆఫీసర్లు మాత్రం హడావుడిగా ఇటీవలే ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. కొత్తగూడెంలో 884 ఇళ్లను ఐదేళ్లుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పాత కొత్తగూడెం ప్రాంతంలో 83 బ్లాక్ లుగా విభజించి ఇళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాక్​లో కనీసం 36 ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటీ పూర్తి కాలేదు. నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ ఇంజనీరింగ్​అధికారులతోపాటు కాంట్రాక్టర్లను ఏడాది కిందే పలుమార్లు ఆదేశించారు. హెచ్చరికలు చేసినా అధికారుల్లో కదలిక లేదు. ఫండ్స్ సక్కగా రాకపోతే ఎలా పూర్తి అవుతాయంటూ కాంట్రాక్టర్లు అంటున్నారు. పాల్వంచలో దాదాపు 400 ఇండ్ల నిర్మాణం చేపట్టి ఏండ్లు గడుస్తున్నా ఒక్కటీ పూర్తి కాలేదు. ఇక్కడా లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను కేటాయించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కేటాయించడంతో వచ్చిందని మురవాలో, నిర్మాణం పూర్తి కాలేదని ఏడ్వాలో లబ్ధిదారులు డోలాయమానంలో పడ్డారు. 

అంతా కౌన్సిలర్ల మాయ..

డబుల్​బెడ్ రూం ఇళ్ల కోసం ఆఫీసర్లు మూడుసార్లు దరఖాస్తులు తీసుకున్నారు. మొదటి, రెండోసారి తీసుకున్న దరఖాస్తులు జాడలేకుండా పోయాయి. గతేడాది మూడోసారి తీసుకున్న దరఖాస్తులనే అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. దాదాపు 5,686 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు చివరకు 1470 మందిని హడావుడిగా ఎంపిక చేశారు. సమగ్ర కుటుంబ సర్వేతోపాటు 360 డిగ్రీస్​రాండం సర్వే పేర లబ్ధిదారులను ఎంపిక చేశారు. సదరు జాబితాను అధికారులు కౌన్సిలర్లకు ఇవ్వడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. జాబితాలోని కొన్ని పేర్లను కౌన్సిలర్లు సెలెక్ట్​చేసి డ్రాలో వచ్చేలా చేశారు. ఇల్లు అలాట్​అయినవారిని కౌన్సిలర్లు రూ.50వేల నుంచి రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని మేదరబస్తీకి చెందిన కౌన్సిలర్​భర్త ఇల్లు అలాట్ అయినవారి వద్ద నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారంటున్నారు.

తన బంగారం తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చే సరికి ఆలశ్యమైందని, తనకు ఇల్లు రాలేదని ఓ మహిళ కౌన్సిలర్​భర్తతో గొడవ పెట్టుకుంది. మరోవార్డులో 20 మంది లబ్ధిదారులకు కౌన్సిలర్​తన సామాజికవర్గానికి చెందిన ఎనిమిది మందికి ఇళ్లు వచ్చేలా చేశారని ఆరోపణలున్నాయి. ఓ కౌన్సిలర్ తన సామాజిక వర్గానికే చెందిన 6 నుంచి 8 మందికి డబుల్ ఇళ్లు వచ్చేలా చేశారని ఆ వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. డబ్బుల విషయం బయటకు చెప్పేవారిని అనర్హులుగా ప్రకటిస్తామని బెదిరిస్తుండడం గమనార్హం. ఎవరికి ఒక్కపైసా ఇవ్వవద్దని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సూచించారు. ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ వందలాది మంది ప్రజలు గత సోమవారం కలెక్టరేట్ఎదుట ధర్నా కూడా చేశారు. ఇదే విషయమై సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.