నన్ను క్షమించు.. కావాలని కామెంట్ చేయలే

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ విజిట్ లో ఏర్పడిన భద్రతా వైఫల్యం ఘటనపై బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌‌కు హీరో సిద్ధార్థ్ స్పందన చర్చనీయాంశం అయింది. తన ట్వీట్ లో సిద్ధార్థ్ ఉపయోగించిన కొన్ని పదాలపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనికి మరో ట్వీట్ లో ఆయన వివరణ ఇచ్చినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా, సైనాకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ సిద్దార్థ్ ఓ లేఖ రాసి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తన ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేదని.. కానీ, కొందరు ఎన్నో అపవాదాలను తన వ్యాఖ్యలతో అంటగట్టారని పేర్కొన్నాడు. తాను మహిళల పక్షపాతి అని, సైనాను ఉద్దేశించిన ట్వీట్‌లో జెండర్‌ను ఉపయోగించలేదన్నాడు. ఒక మహిళగా ఆమెపై ఎలాంటి అభ్యంతరకర పదాలను వాడలేదని వివరించాడు. తన క్షమాపణలను అంగీకరించాలని సైనాకు విజ్ఞప్తి చేశాడు. ‘నువ్వు ఎప్పుడూ నా చాంపియన్‌’గా ఉంటావు అంటూ పేర్కొన్నాడు. 

కాగా, పంజాబ్ పర్యటనలో మోడీకి ఏర్పడ్డ భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై చాలా మంది స్పందించారు. అదే రీతిలో సైనా నెహ్వాల్ కూడా ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. ఒక దేశ ప్రధానికే భద్రత కరువైతే.. ఏ దేశం కూడా తాను సురక్షితమైనందని చెప్పుకోదని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్.. దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీస్తున్నాయి. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు పంపింది. ఓ మహిళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, స్త్రీద్వేషంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉందని మండిపడింది. ఆయన ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని డిమాండ్ చేసింది. 

మరిన్ని వార్తల  కోసం: 

సాహితీలోకం మర్చిపోలేని కవి అలిశెట్టి ప్రభాకర్

టాలీవుడ్ కు భాయ్ వస్తున్నాడు 

ఎనర్టీ ఫుడ్ తింటున్నారా లేదా ?