రోడ్డు ప్రమాదంలో యువ నటుడు అమన్ జైస్వాల్ మృతి

ముంబై: మహారాష్ట్ర బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. యువ టీవీ నటుడు అమన్ జైస్వాల్ (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 2025, జనవరి 17న ముంబైలోని జోగేశ్వరి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అమన్ మరణించాడు. ఓ సీరియల్‎లో ఆడిషన్ కోసం వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మోస్ట్ పాపులర్ హిందీ సీరియల్ ధర్తీపుత్ర నందిని సీరియల్‎లో అమన్ నటించాడు. దీంతో పాటుగా పలు సీరియల్స్‎లో యాక్ట్ చేసి చిన్న వయస్సులోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమన్ జైస్వాల్. 

ధర్తీపుత్ర నందిని రచయిత ధీరజ్ మిశ్రా అమన్ జైస్వాల్ మృతిని ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ‘‘మీరు మా జ్ఞాపకాలలో ఎప్పటికీ జీవిస్తారు.. దేవుడు కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటాడో ఈ రోజు నీ మరణం నాకు ఈ విషయాన్ని గ్రహించేలా చేసింది.. ఆల్వీదా’’ అని ట్వీట్ చేశారు ధీరజ్ మిశ్రా. యాక్టర్‎గా ఎంతో భవిష్యత్ ఉన్న అమన్ చిన్న వయస్సులోనే మృతి చెందడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

అమన్ జైస్వాల్ నేపథ్యం:

ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన అమన్ జైస్వాల్ మోడల్‎గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‎లో అవకాశం దక్కించుకున్నాడు. హిందీలో పాపులర్ సీరియల్ ధర్తీపుత్ర నందినిలో అమన్ ప్రధాన పాత్ర పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే.. సోనీ టీవీ సిరీస్ పుణ్యశ్లోక్ అహల్యాబాయి సీరియల్‎లో అతను యశ్వంత్ రావ్ ఫాన్సే రోల్ ప్లే చేశాడు. సర్గున్ మెహతా నిర్మించిన ఉడారియన్‌ సీరియల్‎లోనూ నటించాడు అమన్.