
హైదరాబాద్: మన దేశంలో వినోదం అంటే గుర్తొచ్చేది సినిమానే. తెరపై తమకు ఎంటర్ టైన్మెంట్ పంచే నటులంటే మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే స్క్రీన్ మీద కనిపించే నటులకు ఉన్నంత అభిమానగణం సినిమాలను తెరకెక్కించే దర్శకులకు ఉండదనే చెప్పాలి. కానీ ఓ డైరెక్టర్ పై ఉన్న అభిమానాన్ని ఆయన ఫ్యాన్ అయిన ఒక హీరో వ్యక్తీకరిస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందన్న దానికి ఇదే నిదర్శనం. సువీక్షిత్ బొజ్జా అనే యువ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కు వీరాభిమాని. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలచిన సుకుమార్ మీద ఉన్న అభిమానాన్ని.. ఇప్పటి వరకు ఏ ఫ్యాన్ కూడా చూపని విధంగా చూపాడు.
ఓ మనిషిపై ఇంత అభిమానమా?
‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్ ది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామం. అక్కడ రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో డైరెక్టర్ సుకుమార్ రూపం వచ్చేలా వరి నాట్లు వేయించాడు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాస అనంతరం సుకుమార్ రూపంలో దర్శనమిస్తున్న వరి పంటను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాడు. అలాగే సుకుమార్ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. తాజాగా ఈ సాంగ్, వీడియోను చూసిన సుకుమార్.. ‘నా నోట మాట రావడం లేదు. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?’ అంటూ సువీక్షిత్‌ను అభినందించారు.
మరిన్ని వార్తల కోసం: