మన యువ బిలినియర్లు
టాప్‌లో జెరోధా బ్రదర్స్
ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ లిస్ట్‌లో వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: వయసు నలబై కంటే తక్కువే..సొంతంగానే ఎదిగారు. చిన్న వయసులోనే బిలినియర్లుగా మారారు. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిలీజ్ చేసిన సెల్ఫ్ మేడ్ రిచ్‌లిస్ట్ 2020 లో 16 మంది ఎంటర్‌ప్రెన్యూర్లు చోటు దక్కించుకున్నారు. ఈ లిస్టులో ఎక్కువ మంది బెంగళూరు సిటీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా 40& అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్‌లిస్ట్ 2020 లో స్థానం సంపాదించుకున్న టాప్ ఐదు మంది ఎంటర్‌ప్రెన్యూర్లు..
జెరోధా ఫౌండర్లు నితిన్, నిఖిల్..
ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధాను స్థాపించిన నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లు కుర్ర బిలినియర్ల లిస్టులో టాప్‌లో ఉన్నారు. వీరి సంపద గతేడాది కంటే 58 శాతం పెరిగి రూ. 24 వేల కోట్లకు చేరుకుంది. 2010 లో స్టార్టయిన జెరోధా కంపెనీ, ప్రస్తుతం క్లయింట్ల పరంగా దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ వాల్యుయేషన్ కూడా బిలియన్ డాలర్లను దాటింది. దీంతో యూనికార్న్ కంపెనీగా జెరోధా ఎదిగింది.
మీడియా.నెట్ ఫౌండర్ దివ్యాంక్
ఇండియాలో పుట్టిన దివ్యాంక్ తురాఖియా 2016 లో మీడియా.నెట్‌ను ఏర్పాటు చేశాడు. యాడ్ బిజినెస్‌లో సక్సెస్ అయిన ఈ కంపెనీని , ఓ చైనీస్ కన్సార్టియం 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే దివ్యాంక్ సంపద 8 శాతం పెరిగి రూ. 14,000 కోట్లకు చేరుకుంది.
ఉడాన్ ఫౌండర్లు..
ఉడాన్ ఫౌండర్లు అమోద్ మాల్వియా, వైభవ్ గుప్తా, సుజీత్ కుమార్‌లు ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ. 13,100 కోట్లుగా ఉంది. బీ2బీ బిజినెస్‌లో ఉన్న ఈ ఈ–కామర్స్ ప్లాట్‌పామ్‌పై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ కంపెనీ ఫౌండర్ల సంపద అమాంతం ఎగిసింది. గతేడాదితో పోలిస్తే ఈ ప్రమోటర్ల సంపద 274 శాతం పెరిగింది. ఉడాన్ వాల్యుయేషన్ గతేడాది అక్టోబర్‌లో రూ. 20 వేల కోట్లు ఉండగా, ఫిబ్రవరి 2020 నాటికి రూ. 52,500 కోట్లకు చేరుకొంది.
బైజూస్ రవింద్రన్..
ఎడ్‌టెక్ కంపెనీ ఫౌండర్ రవింద్రన్ సంపద గతేడాదితో పోలిస్తే 117 శాతం పెరిగి రూ. 7,800 కోట్లకు చేరుకుంది. 2011 లో ఈ కంపెనీని రవింద్రన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం బైజూస్ వాల్యుయేషన్ 11.1 బిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో గ్లోబల్‌గా అత్యంత విలువైన ఎడ్‌టెక్ కంపెనీగా ఇది నిలిచింది.
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు బిన్ని& సచిన్ బన్సాల్..
ఈ లిస్టులో ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు బిన్ని బన్సాల్, సచిన్ బన్సాల్‌లు ఏడో స్థానాన్ని పొందారు. బిన్ని బన్సాల్ సంపద గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరిగి రూ. 7,500 కోట్లకు చేరుకుంది. సచిన్ బన్సాల్ సంపద 23 శాతం పెరిగి 7,500 కోట్లకు పెరిగింది.
మిగిలిన ఎంటర్‌ప్రెన్యూర్లు…
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్(26) సంపద గతేడాదితో పోలిస్తే 40 శాతం తగ్గి రూ. 4,500 కోట్లకు పడిపోయింది. ఈ లిస్టులోని మిగిలిన వారి కంటే రితేష్ చిన్న వాడు కావడం విశేషం. రూ. 3,500 కోట్ల సంపదతో ఓలా క్యాబ్స్ ఫౌండర్లు భావిష్ అగర్వాల్, రూ. 1,600 కోట్లతో అంకిత్ భాటి ఈ లిస్టులో 10,14 స్థానాల్లో ఉన్నారు. ఫుడ్‌డెలివరీ కంపెనీ జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ 13 వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద రూ. 2,200 కోట్లకు పెరిగింది. ఈ లిస్ట్‌లో వీయూ టెక్నాలజీస్ ఫౌండర్ దేవితా సరఫ్ 16 వ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఆమె సంపద 33 శాతం తగ్గి రూ. 1,200 కోట్లకు పరిమితమైంది. కాగా, ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ ఈమె కావడం విశేషం. ఎక్కువమంది ఎంటర్‌ప్రెన్యూర్లు బెంగళూరు నుంచే ఉన్నారు.
For More News..