ప్రేమ క్రైమ్ కథా చిత్రం: థియేటర్‌లో జంట.. కత్తితో పొడిచినవాడితో వెళ్లిపోయిన యువతి

తిరుపతిలో పట్టపగలు కత్తిపోట్లు కలకలం రేపాయి. యువతితో కలిసి సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చిన ఓ యువకుడిపై మరొక యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన మరుక్షణం యువతి దాడిచేసిన యువకుడితో పారిపోవడం గమనార్హం. ఈ ప్రేమ క్రైమ్ సీన్ తిరుపతిలోని పీజీఆర్‌ సినిమా థియేటర్‌లో చోటుచేసుకుంది. 

అందుతున్న వివరాల ప్రకారం.. మోహన్‌బాబు యూనివర్సిటీకి చెందిన లోకేశ్ అనే విద్యార్థి, అదే కాలేజీకి చెందిన ఓ యువతితో కలిసి స్థానిక పీజీఆర్‌ థియేటర్‌లో సినిమాకు వెళ్లాడు. అక్కడ ఈ జంట సినిమా చూస్తుండగా.. కార్తిక్ అనే మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి ఎలాంటి గాయాలు కాకపోగా.. లోకేశ్ కడుపుపై గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం యువతి కత్తితో దాడి చేసిన కార్తీక్‌తో కలిసి పరారైంది. యువతి.. ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. పక్కా ప్లాన్‌తో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. లోకేశ్‌కు యువతే సినిమా టికెట్లు బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ALSO READ : అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని.. రాయితో కొట్టి.. గొంతు పిసికి చంపిన్రు

గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పరారైన యువతీయువకుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.