- యువ బిజినెస్ మ్యాన్ వినయ్ హిరేమత్ విచిత్ర పరిస్థితి
- 33 ఏండ్లకే రూ.8 వేల కోట్లు సంపాదించినట్టు వెల్లడి
న్యూఢిల్లీ : చిన్న వయసులోనే వేల కోట్లు సంపాదించిన ఓ యువకుడికి ఇప్పుడొక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అనుకున్నదానికి మించి డబ్బు సంపాదించిన అతను ఇప్పుడింక ఏం చేయాల్నో తెలీక తికమక పడుతున్నాడు. భారత సంతతికి చెందిన వినయ్ హిరేమత్(33) టెక్ సంస్థ లూమ్ ను స్థాపించి సక్సెస్ అయ్యాడు. తన స్టార్టప్‌ను గతేడాది 975 మిలియన్ డాలర్ల(రూ.8 వేల కోట్లు)కు అట్లాసియన్ అనే సంస్థకు అమ్మేశాడు. అయితే, అంత డబ్బును ఇప్పుడు ఏం చేయాలో తెలీక జుట్టు పీక్కుంటున్నాడు.
తన విచిత్ర పరిస్థితిని వివరిస్తూ..రెండు రోజుల కిందట వినయ్ తన బ్లాగ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. "నేను ధనవంతుడినయ్యా.. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఓ సందిగ్ధంలో ఉన్నా. ఎవరి సానుభూతి పొందడానికో నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు. అసలు ఏ ఉద్దేశంతో ఇలా రాస్తున్నానో కూడా నాకు తెలియదు" అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. వినయ్ ప్రస్తుతం హవాయిలో ఫిజిక్స్ కు సంబంధించిన కోర్స్ చేస్తున్నారు. కొత్త కంపెనీని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
గతేడాది కంపెనీని అమ్మిన వినయ్..ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలు తిరిగేశాడు. ఆ తర్వాత తన సంస్థను కొన్న అట్లాసియన్ సంస్థలోనే జాబ్ వచ్చింది. అట్లాసియన్ 60 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అయితే, వినయ్ ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. రోబోటిక్ సంస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నమూ ఫెయిల్ అయింది. వినయ్ 2018లో విడుదలైన ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలోనూ చోటుదక్కించుకున్నాడు.