ముక్కుపచ్చలారని చిరుప్రాయానికి వెల కడుతున్నారు. అన్నెం పున్నెం ఎరుగని బాల్యాన్ని అంగట్లో సరుకును చేస్తున్నారు. కంటికి రెప్పలా సాకాల్సిన కన్నబిడ్డలను డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారు. ఒకరి నుంచి మరొకరికి బిడ్డలు చేతులు మారుతూ వెలను మారుస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మధురమైన బాల్యానుభూతి కర్కశుల చేతుల్లో ఆహుతి అవుతోంది. కల్మషం లేకుండా విచ్చుకునే పసి మనస్సులకు పాపభీతిని అంటగడుతున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలు చేసిన పిల్లలను కఠినమైన జీవితానికి బలి చేస్తున్నారు. బాల్యవివాహాలు, లైంగిక దాడులు, శ్రమదోపిడీ, వ్యభిచార రొంపిలోకి దింపుతూ విక్రయాల వ్యాపారం సాగుతోంది. గ్రామాలు దాటి పట్టణాలగుండా పిల్లల క్రయ విక్రయాల వ్యాపారం దేశ విదేశాలకు పయనిస్తోంది. చట్టాలను తుంగలో తొక్కి బాలల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఓ వృద్ధురాలు తన మనవరాలిని రూ.55 వేలకు ఓ మహిళకు విక్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ మరో మహిళకు విక్రయించింది. ఈ మూడో మహిళ కుమారుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గదిలో పెట్టి బంధించినప్పటికీ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
పథకాలు ఉన్నా ఫలితాలు అంతంతే!
మారుమూల గిరిజన తండాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘మహిళాకాశం, మాయింటి మహాలక్ష్మి, అమ్మా నన్ను అమ్మకే’ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు అందిరావడం లేదు. తండాల్లో ఆడశిశువు పుట్టగానే ప్రభుత్వం లక్ష రూపాయల నగదును ఆ శిశువు పేరున బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పాటు మూడు ఎకరాల భూమిని ఇచ్చేలా పథకాన్ని రూపొందించినప్పటికీ అలాంటిది ఎక్కడా కార్యరూపం దాల్చడం లేదు. ఆడ శిశువుల అమ్మకాలు, భ్రూణ హత్యలు, పుట్టిన వెంటనే చెట్ల పొదల్లో వదిలివేస్తూ సమాజానికి వేదన కలిగిస్తున్నారు. అవిద్య, పేదరికం మూలంగా దశాబ్దకాలంగా పిల్లల విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. అమ్మినా, కొనుగోలు చేసినా నేరమని చట్టాలు చేసినప్పటికీ తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ బచావో- బేటీ పడావో, కల్యాణలక్ష్మి, మాయింటి మహాలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ ఆడపిల్లలపై చిన్నచూపు ఇంకా తగ్గడం లేదు.
సామాజిక సంపదపై ప్రభావం
అంగట్లో బొమ్మలను అమ్ముతున్నట్లుగా చిన్నపిల్లలను అమ్ముతుండటం సమాజాభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారింది. పాలు కూడా మరువని బాల్యాన్ని పరుల పాలు చేసే తల్లిదండ్రుల మానసిక స్థితికి మందు లేదా? పిల్లలు కలుగక ఎంతోమంది తల్లిదండ్రులు గుళ్లు, గోపురాలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోపక్క పుట్టిన చిన్నారులను అమ్మకాలకు పెడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజల హక్కులను అతిక్రమించి మానవ అక్రమ రవాణా చేస్తున్నారు. ఏటా లక్షల మంది ఇలాంటి సంఘటనలకు గురవుతున్నారు. ఈ సామాజిక వైపరీత్యం వల్ల వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనతో పాటు సమాజం విలువైన మానవ వనరులను కోల్పోవాల్సి వస్తోంది. చిన్నపిల్లలను దొంగిలించడం, కొనుగోలు చేయడం కోసం నెలల వయసులో ఉన్న పిల్లల సమాచారంను సేకరిస్తున్నారు. ఆపైన ఆ పిల్లల కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి రంగంలోకి దిగుతున్న ముఠాలు, పిల్లలను అంగడి సరుకుగా మారుస్తున్నారు. ఇందులో ఆడపిల్లలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఈ అసాంఘిక ఘటనలన్నీ దేశ, రాష్ట్ర సామాజికాభివృద్ధి సూచికలను దిగజార్చుతున్నాయి. రాష్ట్రంలో సృష్టించబడుతున్న సామాజిక సంపదను నిర్వీర్యపరుస్తున్నాయి.
ప్రభుత్వాలకు సవాలుగా..
శాస్త్ర, సాంకేతికరంగాల్లో సమాచార విప్లవం మిళితమై అనూహ్య ఫలితాలు అందివస్తున్న ఈ తరుణంలో పసిపిల్లల అమ్మకాలు ప్రభుత్వాలకు సవాలుగా మారింది. దేశ సంపదను కొల్లగొట్టడంలో పలువురు డాక్టర్లు, రాజకీయ నాయకులు, ఆసుపత్రులు, పలు ముఠాలు భాగస్వాములవుతున్న సంఘటనలు ఇప్పటికే పలుచోట్ల వెలుగుచూశాయి. కేసులు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టేలోగా నిందితులు పారిపోతున్నారు. ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో ఉంచుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు అందిరావడం లేదు. పెద్ద స్థాయిలో పైరవీలు చేసి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. కొంతకాలం మౌనంగా ఉండి తిరిగి ఎప్పటిలాగే పని కానిస్తున్నారు. పసిపిల్లల విక్రయాలు, సెక్స్ రాకెట్ వంటి వాటిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వాలు ముందుకు రాని సంఘటనలు ఉంటున్నాయి. చైల్డ్ లైన్-1098, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం వారు అక్కడక్కడ నిందితులను పట్టుకుంటున్నప్పటికీ, వారిపై కేసులు నమోదుచేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలు మరింత సమన్వయంతో కట్టడి చేయాలి.
- కోడం పవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్