లండన్ లో జాబ్ వదిలేసి..  పుట్ట గొడుగుల సాగు

లండన్ లో జాబ్ వదిలేసి..  పుట్ట గొడుగుల సాగు

మెదక్/కౌడిపల్లి, వెలుగు: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి.. అక్కడే కార్పొరేట్ కంపెనీలో నెలకు ఆరు అంకెల శాలరీ వచ్చే జాబ్ వదిలేశాడు. సొంతూరుకు వచ్చి పుట్ట గొడుగుల పెంపకం చేపట్టాడు ఓ యువకుడు. కుటుంబసభ్యులకు, బంధువులకు దూరంగా ఉండేకంటే ఇంటివద్ద ఉంటూ మనీ సంపాదించడం బెటర్ అనుకుని ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన పూజారి మడుపతి శివప్ప, నాగరాణి దంపతుల కొడుకు సాయి చరణ్ బీఫార్మసీ చదివాడు.

2022లో లండన్ వెళ్లి ఎంఎస్ చేశాడు. అనంతరం అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో జాబ్ లో చేరాడు. నెలకు రూ.2.50 లక్షల శాలరీ వచ్చేది. ఎంత జీతం వస్తున్నా సాయిచరణ్ కు సంతృప్తిగా లేదు.  లండన్ లో వృద్ధులు శారీరక దారుఢ్యంతో, ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ రోజులు బతకడం చూశాడు.  అందుకు కారణం ఏమిటనే దానిపై కొన్నాళ్లు స్టడీ చేశాడు. వాళ్లు తినే ఫుడ్ లో హై ప్రోటీన్లు ఉండే పుట్టగొడుగులను చేర్చడంతో ఇమ్యూనిటీ బాగా పెరిగి హెల్దీగా ఉంటున్నారని, తద్వారా శారీరకంగాను దృఢంగా ఉంటున్నారని తెలుసుకున్నాడు. 

ఇండియాకు తిరిగొచ్చి..

మన వద్ద కూడా ఇమ్యూనిటీ పెంచే పుట్ట గొడుగుల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగొచ్చాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు పుట్టగొడుగుల పెంపకంపై ట్రైనింగ్ పొందాడు. ఆ తర్వాత  సొంతూరు తునికి గ్రామానికి వెళ్లాడు. ఇంటి ముందు ఖాళీ జాగాలో షెడ్డు ఏర్పాటు చేశాడు. రూ.1.50 లక్షలు ఖర్చు చేసి అవసరమైన సామగ్రి కొనుగోలు చేశాడు. గడ్డి కోసే మెషీన్, ర్యాక్ లు, సేంద్రియ ఎరువు, ఎర్ర మట్టి వంటి ఇతర వస్తువులు సమకూర్చుకున్నాడు.

ఆరు నెలలుగా పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నాడు. ప్రయోగాత్మకంగా మిల్కీ రకానికి చెందిన పుట్ట గొడుగులను మూడు బ్యాచ్ ల్లో 50 కిలోల చొప్పున ఉత్పత్తి చేశాడు.  పుట్టగొడుగుల అమ్మకానికి ముందుగానే ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సాయి చరణ్ తెలిపాడు.  ఉత్పత్తి చేసే పుట్ట గొడుగులను  హైదరాబాద్ లోని సూపర్ మార్కెట్లలో కిలో రూ.300 లెక్కన అమ్ముతున్నాడు. 

పెంపకం ఇలా..

పుట్ట గొడుగుల సీడ్స్ ను  ప్రత్యేక సంచుల్లో నాటి 20 రోజులు డార్క్ రూమ్ లో ఉంచుతారు.  ఆ  తర్వాత  సంచులను వెలుతురు తగిలే చోట పెడతారు.  అప్పుడు పుట్ట గొడుగులు పెరుగుతాయి. ఇలా 25 నుంచి 55 రోజుల వరకు మూడు విడతల్లో పంట చేతికి వస్తుంది. 

మన వద్ద కొవిడ్ తర్వాత మార్పు..

లండన్ లో పుట్టగొడుగులు తింటూ 90 ఏండ్ల వృద్ధులు సైతం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు. అదే మనదేశంలో  చిన్న ఏజ్ లోనే  హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. గుండెపోటు బారిన కూడా పడుతుంటారు. ఇందుకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేక పోవడమే కారణం. కొవిడ్ తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టారు. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మంచి రిజల్టు ఇచ్చే పుట్టగొడుగులను ఫుడ్ లో  చేర్చుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.

అందుకు పుట్టగొడుగుల పెంపకం చేపట్టాను.   ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహార పదార్థాన్ని అందించడంతో పాటు, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించవచ్చు. బిజినెస్ బాగా నడుస్తుంది. వెయ్యి బ్యాగుల్లో వెయ్యికిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి చేస్తున్నాను. - సాయి చరణ్, పుట్టగొడుకుల ఉత్పత్తిదారుడు