నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుకు యువ రైతు మృతి

  •     మరొకరికి తీవ్ర గాయాలు
  •     అంబకంటిలో విషాదం 

కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ యువ రైతు మృతి చెందాడు. మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన సోర్ మార్ మహేందర్(32), మరో రైతు మ్యాతరి ముత్యం గురువారం పంట చేనులో పత్తికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం వచ్చింది. దీంతో వారు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి నిల్చున్నారు. ఇంతలోనే వారిపై పిడుగు పడడంతో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ముత్యంకు తీవ్ర గాయాలయ్యాయి.

తోటి రైతులు గమనించి ముత్యంను గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుంచి చికిత్స కోసం 108లో బైంసాకు తరలించారు. ఈ ఘటనతో అంబకంటిలో విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడు మహేందర్​కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హన్మాండ్లు తెలిపారు.