బైక్పై వెళ్తూ గుండెపోటుతో రైతు మృతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాంబయ్య పల్లె గ్రామానికి చెందిన సతీష్ (32) అనే యువ రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు బైక్ పై వెళుతూ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.

గుండెపోటు పదం వినగానే ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిమ్ లో వ్యాయామం చేస్తూ..వాకింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కూర్చుని మాట్లాడుతుండగానే ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇటీవల కాలంలో పలువురు యువకులు సరదాగా క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై చనిపోయారు. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో క్రికెట్ ఆడుతూ ఆంజనేయులు అనే యువకుడు మరణించాడు.