
ఇండియాను చూసేందుకు ఫ్రెండ్‌తో వచ్చిన యువతి
మార్కెట్‌కు వెళ్తుండగా డ్రాప్చేస్తామని నమ్మించిన నిందితుడు
నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేప్
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఎల్బీ నగర్/పహడీ షరీఫ్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఓ జర్మనీ యువతిపై నగరానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని మీర్ పేట్ లో ఉంటున్న మంగళగిరి శరత్ చంద్ర చౌదరి 2024లో ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లాడు.
అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మెస్సినాలో చదువుతున్నాడు. అదే వర్సిటీ లో చదువుతున్న జర్మనీకి చెందిన యువతి, మరో యువకుడు శరత్ చంద్రకు పరిచయమయ్యారు. ముగ్గురూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం కింద శరత్ ఇండియా వచ్చాడు. గత నెల 4న జర్మనీయువతి, యువకుడు హైదరాబాద్ చూసేందుకు వచ్చారు.
వారు శరత్ ఇంట్లోనే ఉంటూ నగరంలోని కొన్ని ప్రాంతాలను చూసి వచ్చారు. గత నెల 31న శరత్ తన తల్లి, అక్క, అక్క కూతురిని తీసుకొచ్చేందుకు వరంగల్ వెళ్లాడు. అదేరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు యువతి, యువకుడు ధాతు నగర్ మార్కెట్లో కూరగాయలు కొనేందుకు వెళుతున్నారు. ఆ టైంలో కారులో వచ్చిన యాకత్‌పురాకు చెందిన ఐదుగురు మైనర్లు, కారు నడుపుతున్న మరో యువకుడు జర్మనీయువతీ యువకుడికి హాయ్ చెప్పారు.
వారు కూడా తిరిగి హాయ్ చెప్పారు. కారును మహ్మద్ అబ్దుల్ అస్లాం (25) నడుపుతున్నాడు. మీరు ఎక్కడికి వెళ్లాలని అతను అడగ్గా మార్కెట్ కు అని వారు బదులిచ్చారు. తాము డ్రాప్ చేస్తామని నమ్మించి అస్లాం వారిని కారులో ఎక్కించుకున్నాడు.
పెట్రోల్ కొట్టించాలని చంద్రాయణగుట్టకు..
యువతీ, యువకుడిని మార్కెట్ దగ్గర దింపకుండా పెట్రోల్ పోయించుకోవాల్సి ఉందంటూ మహ్మద్ అబ్దుల్ అస్లాం కారును చంద్రాయణగుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి పహడీ ఫరీఫ్లోని మామిడిపల్లికి డ్రైవ్ చేశాడు. అక్కడ మైనర్లు కారు దిగి సెల్ఫీలు తీసుకుంటున్నారు. జర్మనీ యవతి, ఆమె ఫ్రెండ్‌ను కూడా కారు దిగి, సెల్ఫీలు తీసుకోవాలని అస్లాం సూచించాడు.
మైనర్లు జర్మనీ యువకుడితో సెల్ఫీలు తీసుకుంటుండగా.. కొద్ది దూరంలో మంచి ప్లేస్ ఉందని, అది చూపించి తీసుకువస్తానని అస్లామ్.. యువతిని కారులో తీసుకెళ్లాడు. కొద్ది దూరం వెళ్లి కారు ఆపి, యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు. తర్వాత అదే కారులో మైనర్లున్న చోటికి వస్తుండగా కారు స్లో కావడంతో బాధితురాలు కారులో నుంచి దూకింది. జరిగిన విషయాన్ని యువకుడికి చెప్పింది.
ఇద్దరూ కలిసి కొందరి సాయంతో మీర్‌పేట్‌కు చేరుకున్నారు. తర్వాత పహడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు అబ్దుల్అస్లామ్ను మంగళవారం సాయంత్రం అరెస్టుచేశారు.