భారత యువతరానిది కోహ్లీ మనస్తత్వం: రఘురామ్‌ రాజన్‌

భారత యువతరానిది కోహ్లీ మనస్తత్వం: రఘురామ్‌ రాజన్‌

భారత యువతరం విరాట్‌ కోహ్లీలా ఆలోచిస్తున్నారని,  ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పరోక్షంగా కోహ్లీలా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో "మేకింగ్‌ ఇండియా యాన్‌ అడ్వాన్స్‌ ఎకానమీ బై 2047" అంశంపై నిర్వహించిన సదస్సులో రఘురామ్‌ రాజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"వాస్తవానికి దేశంలో చాలామంది యువత.. తమ వ్యాపారాలను స్థాపించడానికి విదేశాలకు వెళ్తున్నాదు. అందుకు గల కారణాలేంటో వారే  చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని మార్చాలన్న దృక్పథం దేశ యువతరానిలో ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కానీ, అలాంటి ఆలోచనలు ఉన్న వారు మన దేశంలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. యువ భారత్‌ది విరాట్ కోహ్లీ మనస్తత్వం అని నేను భావిస్తున్నా.. ప్రపంచంతో పోటీపడాలనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు. " అని ఆర్‌బీఐ మాజీ అని గవర్నర్ అన్నారు. 

ఇక నిరుద్యోగ సమస్యపై మాట్లాడిన రఘురామ్‌ రాజన్‌.. దేశంలో కొన్ని దశాబ్దాలుగా నిరుద్యోగ సమస్య పెరుగుతూ వస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు సైతం రైల్వేలో ప్యూన్‌ల పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న విషయాన్ని రాజన్ హైలైట్ చేశారు. దీన్ని విస్మరిస్తే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. మూలధనాన్ని మెరుగుపరచడం, నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.